50% వీవీప్యాట్ల లెక్కింపు కుదరదు | Supreme Court dismisses plea by 21 Opposition Parties for 50 Percent VVPAT Verification | Sakshi
Sakshi News home page

50% వీవీప్యాట్ల లెక్కింపు కుదరదు

Published Wed, May 8 2019 3:32 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Supreme Court dismisses plea by 21 Opposition Parties for 50 Percent VVPAT Verification - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ స్లిప్‌(వీవీప్యాట్‌)లను సరిపోల్చాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్‌ బూత్‌లలోని ఈవీఎంలతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్‌ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు పేర్కొంది.

ఈ అంశంపై 21 ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ లాయర్లు ఏఎం సింఘ్వి, కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్‌ బూత్‌కు బదులు ఏవైనా ఐదు బూత్‌లలో ఈవీఎంల ఫలితాలతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్‌ 8వ తేదీన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఇది మొత్తం ఫలితాలలో కేవలం 2 శాతం మాత్రమే. దీనివల్ల ఉపయోగం లేదు. అందుకే కనీసం 50 శాతం ఫలితాలతో సరిపోల్చాలని మేం అడుగుతున్నాం. దీనిని 33 శాతం లేదా కనీసం 25 శాతం పెంచినా మాకు సంతోషమే. దీనివల్ల ఈసీ వ్యవస్థపై కేవలం రాజకీయ పార్టీలకే కాదు, ఓటర్లలోనూ ఆమోదయోగ్యతతోపాటు, విశ్వాసం పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘ఒకవేళ, 5 పోలింగ్‌ బూత్‌లలో ఎలాంటి తేడాలు కనిపించకుంటే ఏం చేస్తారు? దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు లేవు’ అని వారు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో గతంలో జరిగిన విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని ఈసీ తప్పుదోవ పట్టించిందని వారు పేర్కొనగా.. ప్రస్తుత వాదనలు కేవలం రివ్యూ పిటిషన్‌పై మాత్రమేనంటూ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్‌ 8వ తేదీనాటి తీర్పును సమీక్షించటానికి సిద్ధంగా లేమని తేల్చింది. ఈ బెంచ్‌ ఒక్క నిమిషంలో తీర్పు ముగించింది. వాదనలప్పుడు ప్రతిపక్ష నేతలు ఫరూక్‌ అబ్దుల్లా, డి.రాజా, చంద్రబాబు నాయుడు కోర్టు హాల్లోనే ఉన్నారు. 

ఎన్నికల సంఘాన్ని కలిసిన విపక్ష నేతలు
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక నియోజకవర్గానికి కేవలం 5 శాతం వీవీ ప్యాట్లు కాకుండా కనీసం 15 లేదా 25 శాతం లెక్కించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని 21 విపక్షాలు కోరాయి. కాంగ్రెస్‌ నుంచి అభిషేక్‌ సింఘ్వీ, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్, ఏపీ సీఎం చంద్రబాబు, సీపీఐ ఎంపీ డి. రాజా సహా పలు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిశారు. ఐదు శాతం వీవీప్యాట్‌ల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పు సమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలతో 15 లేదా 25 శాతం వీవీప్యాట్లు లెక్కించేలా ఆదేశాలు ఇవ్వవచ్చని పార్టీలు పేర్కొన్నాయి.

అలాగే ఓట్ల లెక్కింపు సందర్భంగా నియోజకవర్గాల వారీగా ఈవీఎంలలో పోలైన ఓట్లకు వీవీప్యాట్లలోని ఓట్లకు తేడాలోచ్చిన చోట మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని కోరారు. ఈవీఎంలతో సమాంతరంగా వీవీప్యాట్‌లను లెక్కించా లని విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిప్పుల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థి రీకౌంటింగ్‌ కోరితే మళ్లీ లెక్కించాలని ఈసీని కోరినట్టు కూడా ఆ నేతలు మీడియాకు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement