ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేస్తున్న 21 రాజకీయ పక్షాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అయిదు ఈవీఎంలలో పడిన ఓట్లను వాటికి అనుసంధానించే ప్రింటర్(వీవీప్యాట్)లలో వెలువడే రశీదులతో సరిపోల్చాలని సోమవారం సర్వో న్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలుంటాయి గనుక 35 ఈవీఎంలను వాటికుండే వీవీ ప్యాట్‌లతో అధికారులు పోల్చి చూడవ లసి ఉంటుంది. ప్రతి స్థానంలోనూ కనీసం 50 శాతం వీవీ ప్యాట్ రశీదులను లెక్కించాలన్న పార్టీల అభ్యర్థననూ, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో వీవీ ప్యాట్ యంత్రాన్ని ఎంపిక చేసి లెక్కించే ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తే సరిపోతుందన్న ఎన్నికల సంఘం వాదననూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగడం ఎంత ముఖ్యమో... అలా జరిగాయన్న అభిప్రాయం పౌరులకు కలగటం కూడా అంతే అవసరం. ఎందుకంటే విశ్వసనీయత ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రదం. అన్ని వ్యవస్థలూ సక్రమంగా, పారదర్శకంగా పనిచేస్తున్నాయన్న అభిప్రాయం బలపడితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. కనుక తాజా తీర్పును స్వాగతించదగ్గది.
బ్యాలెట్ పత్రాల విధానం వదిలి ఈవీఎంలను ప్రవేశపెట్టిన నాటినుంచీ వాటిపై ఏదో మేరకు శంకలున్నాయి. ఇవి పౌరుల్లో కంటే పార్టీల్లోనే అధికం. అలాగని ఈ పార్టీలను– ఈవీఎంలను శంకించే పార్టీలు, వాటిని విశ్వసించే పార్టీలు అని విభజించడం సాధ్యం కాదు. నెగ్గితే తమ ఘనత, ఓడితే ఈవీఎంల దోషమని చెప్పడం చాలా రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. ఎన్నికల ఫలి తాలు వెలువడి జాతకం తలకిందులైన వెంటనే అధికార పక్షం ‘టాంపరింగ్’ చేసిందని, అలా జరగ కపోతే తాము బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించేవారమని పరాజితులు చెబుతారు. కంప్యూటర్ల దగ్గర నుంచి సెల్ ఫోన్ల వరకూ అన్నిటికీ తానే ఆద్యుడినని తరచు చెప్పుకునే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటమిపాలై అధికారానికి దూరమైనప్పుడల్లా ఈవీ ఎంలనే దోషిగా చూపారు. 2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లూ ఆయన ఈవీఎంల వల్లనే ఓడానని రాద్ధాంతం చేశారు. ఆయా సంవత్సరాల్లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంలో ఓడినప్పుడు కూడా ఆయన ఆక్రోశం అదే విధంగా కొనసాగింది. తీరా 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు మాత్రం ఆయన గారు మౌనంగా ఉండిపోయారు. చంద్రబాబు మాత్రమే కాదు... ఓడిన రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజే పీలు గతంలో ఈ మాదిరి ఆరోపణలే చేశాయి. 2012లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అధికార అకాలీ దళ్ విజయం సాధిస్తే ఈవీఎంల సోర్స్ కోడ్‌ను హ్యాకర్ల ద్వారా ఆ పార్టీ మార్చేయడం వల్లే ఓడి పోయామని కాంగ్రెస్ ఆరోపించింది.
కానీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు మాత్రం ఆ పార్టీ ఈవీఎంల విషయంలో మౌనంగా ఉండిపోయింది. విచిత్రమేమంటే ఆరోపణ చేసిన పార్టీలు ఏ సందర్భంలోనూ వాటిని నిరూపించడానికి ప్రయత్నించలేదు. తమ వాదనకు మద్దతుగా కనీసం ఒక్క ఉదంతాన్నయినా చూపలేదు. అయినా రాజకీయ పార్టీల్లో ఈవీఎంలపై శంక ఉంటున్నది కనుక వీవీ ప్యాట్‌లను తీసుకురావాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంత క్రితం ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వీటిని వినియోగించిన సంఘం 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వీవీ ప్యాట్‌లను అమర్చింది. 2017 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో వీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించడం ప్రారంభించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తొలిసారి మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లోనూ వీటిని వినియోగిస్తున్నారు.
ఈవీఎంలో తాను వేసిన ఓటు ఎంపిక చేసుకున్న అభ్యర్థికే పడిందని ఓటరు నిర్ధారించుకోవడా నికి వీవీ ప్యాట్‌లో వెలువడే రశీదు ఉపయోగపడుతుంది. అందులో వెలువడే రశీదు ఏడు సెకన్ల పాటు కనబడి దానికి అమర్చి ఉన్న బాక్స్‌లో పడే ఏర్పాటుంది. వీవీ ప్యాట్‌లు ఉపయోగించిన ఏ కేంద్రంలోనూ తాము ఒకరికి ఓటేస్తే వేరే వారికి వేసినట్టు రికార్డయిందని ఏ ఓటరూ ఇంతవరకూ ఫిర్యాదు చేయనప్పటికీ రాజకీయ పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం మానుకోలేదు. 2017లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ ఈవీఎంలలో లోపాలున్నాయని నిరూపిం చమని పార్టీలకు సవాలు విసిరారు. ఇది గెలుపోటములను నిర్ణయించడానికి కాక ఉన్న వ్యవస్థను పటిష్టం చేయడం కోసమేనని ఆయన చెప్పారు. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆ అవకాశాన్ని విని యోగించుకోలేదు. అలాగని ఈవీఎంలపై ఆరోపణలు మానుకోలేదు. మొన్న జనవరిలో అమెరి కాలో ముసుగు ధరించి కూర్చుని స్కైప్ ద్వారా లండన్‌లోని పాత్రికేయులతో మాట్లాడిన సయ్యద్ షుజా అనే వ్యక్తి ఈవీఎంలపై ఆరోపణలు చేశాడు.
ఈవీఎంల విశ్వసనీయత గురించి మరెవరూ భవిష్యత్తులో ఆరోపణలు చేయకూడదనుకుంటే వీవీ ప్యాట్ రశీదులను లెక్కించి, ఆ సంఖ్య ఈవీ ఎంలో పోలైన ఓట్ల సంఖ్యతో సరిపోయిందని నిరూపించడం ఒక్కటే మార్గం. దానివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమవుతుందన్న ఈసీ వాదన వాస్తవమే అయినా ఆరోపణలకు ఫుల్‌స్టాప్ పడాలంటే వేరే మార్గం లేదు. ఈ అంశంలో ఈసీని కూడా తప్పుబట్టాలి. అది ఇంతవరకూ నియోజక వర్గానికి ఒక్కో ఈవీఎం–వీవీ ప్యాట్‌లను మాత్రమే తీసుకుని లెక్కేస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో తగిన శాంపి ల్‌ను తీసుకోవాలని అది అనుకోలేదు. అలాగే పూర్తి స్థాయిలో వీవీ ప్యాట్‌లు ఉపయోగించిన 2017 మొదలుకొని నేటివరకూ లెక్కించిన మేరకైనా ఈవీఎం–వీవీ ప్యాట్‌ల మధ్య లెక్క సరిపోయిందో లేదో అధికారికంగా ఎప్పుడూ చెప్పలేదు. ఆ పని చేసి ఉంటే ఆరోపణలు చేసేవారి నోళ్లు మూత పడేవి. ఆ సంగతలా ఉంచి లెక్కింపులో వీవీ ప్యాట్ రశీదులకూ, పోలైన ఓట్లకూ పొంతన లేని స్థితి ఏర్పడిన పక్షంలో ఏం చేయాలన్న విషయంలో స్పష్టత లేదు. మొత్తానికి వచ్చే నెల 23న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడయ్యాకైనా ఈవీఎంలపై రేగుతున్న దుమారం చల్లారాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment