
సభలో అభివాదం చేస్తున్న సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ, పువ్వాడ తదితరులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒకరి ఇంటి సొత్తుగా మారడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారందరూ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేలా పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఖమ్మం జిల్లా 21వ మహాసభల సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట వద్ద శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో సురవరం ప్రసంగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో, కేం ద్రంలో అధికార పక్షాలు ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారారని, ఆ కంపెనీలు భారీ అక్రమాలకు పాల్పడుతున్నా తనకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో మతోన్మాదానికి తావు లేదని, మత శక్తులకు కొమ్ముకాస్తున్న ఏ పార్టీనీ ప్రజలు క్షమించబోరని, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ప్రజలు తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. విజయ్ మాల్యా బ్యాంకుల రుణాలను ఎగవేసి విదేశాలకు వెళితే.. నరేంద్ర మోదీ ఇది తమ పరిధిలోని అంశం కాదన్న రీతిలో వ్యవహరించడం చూస్తే ఆయన ఎవరికి మద్దతుగా నిలిచారో అర్థమవుతోందన్నారు.
ఇక తెలంగాణలో ప్రజల సమస్యలు చూస్తే ఆందోళనకరంగా ఉన్నాయని, బంగారు తెలంగాణ పేరుతో భ్రమలు కల్పించిన కేసీఆర్ ఆచరణలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వంపై ఐక్య పోరాటాలు చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. తెలంగాణ సాధనలో సీపీఐ కీలకపాత్ర పోషించిందన్నారు. సభకు పార్టీ జిల్లా నాయకుడు దండి సురేశ్ అధ్యక్షత వహించగా.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి, టీవీ చౌదరి, సీపీఐ జిల్లా కార్యదర్శులు బాగం హేమంతరావు, సాబీర్‌పాషా, పోటు కళావతి పాల్గొన్నారు.