సాక్షి, న్యూఢిల్లీ: కులభూషణ్ జాధవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరును జాతీయ పార్టీల నాయకులు తీవ్రంగా గర్హించారు. జాధవ్ తల్లి, భార్యను పొరుగుదేశం అవమానించడాన్ని ఖండించారు. జాధవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ వైఖరి తలదించుకునేలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు నరేశ్ అగర్వాల్ తదితరులు ధ్వజమెత్తారు.
పార్లమెంట్‌లో రేపు ప్రకటన
పాకిస్తాన్ ప్రవర్తనపై పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. జాధవ్ కుటుంబ సభ్యుల పట్ల పాక్ వైఖరి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. జాధవ్‌ను తిరిగి మనదేశానికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై రేపు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభలో, మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రకటన చేస్తానని వెల్లడించారు.
భారత్ గూఢచారిగా ముద్రపడి 22 నెలలనుంచి పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న కులభూషణ్ జాధవ్‌ను ఈ నెల 25న ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై స్పందించేందుకు భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సొహైల్ మహమూద్ నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment