పాకిస్తాన్ కు సుష్మా స్వరాజ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్ విషయంలో పాకిస్తాన్ కుట్రపూరితంగా వ్యవరిస్తోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారణ జరపకుండానే పాకిస్తాన్ మిలటరీ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించిందని అన్నారు. ఈ అంశంపై రాజ్యసభలో మంగళవారం సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. కుల్‌భూషణ్ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆధారాలు లేవన్నారు. విచారణ పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు.
కుల్‌భూషణ్ కు ఉరిశిక్ష విధిస్తే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చోటుచేసుకోబోయే పరిణామాలకు పాకిస్తాన్ బాధ్యత వహించాల్సివుంటుందని సుష్మ హెచ్చరించారు. కుల్‌భూషణ్ కు భారత్ అండగా ఉంటుందని చెప్పారు. అతడికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కుల్‌భూషణ్ తరపున పాకిస్తాన్ సుప్రీంకోర్టులో వాదించేందుకు మంచి లాయర్ ను నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ సూచించారు.