సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎంపీలపై తక్షణం అనర్హత వేటు వేయాలని, తద్వారా ప్రజాస్వా మ్యాన్ని కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వినతిపత్రాన్ని శుక్రవారం స్పీకర్‌కు సమర్పించారు. ‘‘వైఎస్సార్‌సీపీ టిక్కెట్లపై గెలుపొంది ఇతర పార్టీల్లోకి ఫిరాయించి రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పి.శ్రీనివాస్‌రెడ్డి, బుట్టా రేణుకలను అనర్హులుగా ప్రకటించాలని జనవరి 3, 2018న అప్పుడు చీఫ్‌విప్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి మీకు లేఖ రాశారు.
నంద్యాల నియోజకవర్గం నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో మాపార్టీ టికెట్‌పై గెలుపొందిన ఎస్పీవై రెడ్డి వారం రోజులకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలోకి ఫిరాయించారు. అలాగే మా పార్టీ టికెట్‌పై గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా టీడీపీలోకి ఫిరాయించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని బలహీనపరచాలన్న ఉద్దేశంతో అధికారపార్టీ అనేక ఆశలు చూపి వీరికి వల విసిరింది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి మాపార్టీ టికెట్‌పై పోటీ చేసి తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి ఫిరాయించారు.వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని మా పార్టీ డిసెంబర్ 14, 2016న మీ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.
అయినప్పటికీ ఇప్పటివరకు వారిపై అనర్హత నిర్ణయం ప్రకటించలేదు. ఈ పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనందువల్ల.. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఎలాంటి చర్యలు ఉండవన్న సంకేతాన్నిస్తూ ఇతర ఎంపీలు కూడా పార్టీ ఫిరాయించేందుకు విశ్వాసం కలిగించింది. అక్టోబర్ 17, 2017న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా మా పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. ఆమెపైనా పార్టీ ఫిరాయింపు నిరోధక నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని మీవద్ద పిటిషన్ దాఖలు చేశాం. ఈ నలుగురు సభ్యులు టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీల కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఇచ్చే అధికారిక సమాచారానికి మాత్రం స్పందించట్లేదు..’’ అని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి..
‘‘అధికారపార్టీలు పెట్టే ఆశలతో ప్రేరేపితమైన రాజకీయ ఫిరాయింపులు రాజ్యాంగ స్ఫూర్తి పునాదులకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరంగా దాపురించాయన్న ఉద్దేశంతో వీటిని అరికట్టేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని తెచ్చుకున్నాం. ఒకపార్టీ నుంచి చట్టసభల సభ్యుడిగా ఎన్నికై.. మరో పార్టీకి వెళితే వారిని అనర్హులుగా చేయాలని ఈ చట్టం తెచ్చుకున్నాం. రాజ్యాంగంలో ఇంతటి బలమైన నిబంధనలున్నప్పటికీ సభ్యులు స్వేచ్ఛగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. అనర్హత నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సభాపతులపై ఉండగా వారు నిర్ణయం తీసుకోకపోగా ఇతరులు సైతం ఫిరాయించేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు.
ఈ రకంగా ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఓడిపోవడమేగాక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రమాదకరమైన ధోరణి ప్రబలేందుకు కారణమైంది. ఇటీవల ఈ ఫిరాయింపులు మరింత విశృంఖలంంగా బహిరంగంగా మీడియా సమక్షంలోనే జరుగుతుండడం మనం చూస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ ఇటీవల శరద్ యాదవ్, అన్వర్ అలీలపై పిటిషన్ వచ్చిన 90 రోజుల్లోపే నిర్ణయం తీసుకుని అనర్హులుగా ప్రకటించారు.
అలాంటి వేగవంతమైన నిర్ణయాలు ఫిరాయింపులను అరికట్టడమేగాక ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉద్దేశాన్ని నెరవేర్చుతాయి. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎంపీలపై చర్య తీసుకుని మీరు మార్గదర్శిగా నిలవాలని కోరుతున్నా. ఆ నలుగురు సభ్యులపై అనర్హత వేటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అభ్యర్థిస్తున్నా..’’ అని విజయసాయిరెడ్డి విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment