సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు చూసి మహాకూటమికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ‘ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిఫెన్స్‌లో సాధారణ ఉద్యోగి మాత్రమే. అక్కడినుంచి రాష్ట్రపతి దగ్గర ఉద్యోగం సంపాదించాడు. ఢిల్లీలో పైరవీ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడొచ్చి తాను పెద్ద సైనికుడినని బిల్డప్ ఇస్తున్నాడు’ అని తలసాని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ అన్నీ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ బట్టేబాజ్ నాయకుల ఇళ్లలో కరెంట్ వస్తుందా లేదా?’ అని తలసాని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో సబ్బండవర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌లో కోటి ఇళ్లు ఉన్నయి.. ఇంటికో ఉద్యోగం అంటే కోటి ఉద్యోగాలు వస్తాయా?.. బట్టేబాజ్ మాటలు కాకపోతే.. అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ దొంగలేనని, వారిలో యూనిటీ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్లు ఐదువేల కిరాయి ఇచ్చుడు తర్వాత, తమ ఐదు అసెంబ్లీ సీట్లను కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయని, ఐటీ దాడులు ఎవరి మీదనో జరిగితే.. టీడీపీ గగ్గోలు పెడుతోందని విమర్శించారు. మహాకూటమి నుంచి టీడీపీ ఒక రెండు సీట్లు గెలిచినా.. అందులోనే ఉంటారా? అని అన్నారు. హైదరాబాద్‌లో నివసించే అందరూ అన్నదమ్ములేనని, ఎంఐఎం పార్టీ తమ ఫ్రెండ్లీ పార్టీ అని రాయల్‌గా చెప్పుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment