సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఏదో టైం పాస్ కోసం, టీవీల్లో, పేపర్లలో కనబడాలని సచివాలయాన్ని సందర్శించారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. ఏదో విహార యాత్రకు వచ్చినట్టు ఫొటోలు దిగారని విమర్శించారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం సచివాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే వీటిపై స్పందించిన తలసాని.. సచివాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు కనీసం అరగంట కూడా అక్కడ లేరని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా కొత్త సచివాలయం, అసెంబ్లీ ఉండాలనేదే సీఎం ఆలోచన అని ఆయన తెలిపారు. కొత్త సచివాలయం నిర్మిస్తే కాంగ్రెస్ నేతల ముల్లేం పోయిందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు, గురుకులాల నిర్మాణం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడూ ఆలోచించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు అనేక కేసులు వేశారని తెలిపారు. ఆరునూరైన కొత్త సచివాలయం నిర్మాణం చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు రాజకీయ ఉద్యోగాలు తీసుకున్నారే తప్ప.. ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ పదవి వద్దని పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలతో ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండకూడదని.. ఎమ్మెల్యేలు పోయిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయాలపై తాను మాట్లాడనని అన్నారు. ఏనుగు వెళ్లేటప్పుడు ఎన్నో మొరుగుతాయని.. వాటిని పట్టించుకుంటామా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment