్చతుక్కుగూడలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, తీగలతో కలిసి రోడ్ షో నిర్వహిస్తున్న మంత్రి తలసాని
సాక్షి, మహేశ్వరం: బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాలులో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ, అనంతరం తుక్కుగూడలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత తుక్కుగూడలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆసరా పథకం కింద పింఛన్లు అందజేస్తోందని పేర్కొన్నారు.
రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ. 8 వేలతోపాటు రైతుకు బీమా అందజేస్తోందని పేర్కొన్నారు. రైతుల పక్షపాతిగా మారిన టీఆర్‌ఎస్ సర్కారు వారికి సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు అందజేసిందని తెలిపారు. పేదింటి యువతుల వివాహం కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందజేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో బీటీ రోడ్డు, మిషన్ కాకతీయ కింద చెరువులు, కాల్వల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగిపోకూడదంటే తిరిగి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సబితను చిత్తుగా ఓడిస్తా: తీగల
త్వరలో జరిగే ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న సబితాఇంద్రారెడ్డిని చిత్తుగా ఓడించి గులాబీ జెండాను ఎగురవేస్తామని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అవినీతికి మారుపేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ హయాంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తిగా వెనుకబడి పోయిందని మండిపడ్డారు. శిలాఫలకాలు వేసి అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా సబితాఇంద్రారెడ్డి ప్రజలకు దూరంగా ఉండి ఎన్నికలు దగ్గరకు రావడంతో తిరిగి గ్రామాలబాట పడుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో సుమారు రూ. 700 కోట్ల నిధులతో తాము పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
మరోసారి తనను ఆశీర్వదిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తీగల పేర్కొన్నారు. అంతకు ముందు తుక్కుగూడ– శ్రీశైలం రహదారి నుండి మహేశ్వరం వరకు భారీ బైక్, కార్ ర్యాలీ నిర్వహించారు. మహిళలలు భారీ ఎత్తున హజరయ్యారు. కాగా, కార్యక్రమానికి మహేశ్వరం జెడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎడ్మ మోహన్‌రెడ్డి, రావిర్యాల మాజీ సర్పంచ్ జెల్లల లక్ష్మయ్య గైర్హాజరయ్యారు.
సభ వేదికపైన యువకులు, మహిళలతో కలిసి తీగల బతుకమ్మ ఆడిపాడారు. కళాకారుడు సాయిచందర్ ఆటాపాటలు అలరించాయి. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పెంటారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు తీగల అనితారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, కందుకూరు మండల అధ్యక్షుడు భిక్షఫతి, మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతిలక్ష్మీనర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు కరుణాకర్‌రెడ్డి, కూన యాదయ్య, అనంతలక్ష్మి, ఎంపీటీసీలు సురేష్, బాలమ్మ, శశిరేఖ, నర్సింహ, రాఘవేందర్‌రెడ్డి, మర్యాద రాఘవేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment