సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: టికెట్ల కేటాయింపు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒక్కో సీటుకు ఇద్దరు ముగ్గురు పోటీపడుతున్నారు. ఆశావహుల మధ్య పోటీ ఉండడం సహజమే అయినా వైరివర్గాలుగా వ్యవహరిస్తుండడం ఇబ్బందిగా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే.. మరొకరు సహకరించే పరిస్థితి లేకపోవడంతో అధినాయకత్వం దిక్కుతోచని పరిస్థితిలో పడింది.
చేవెళ్లలో యమ డిమాండ్
చేవెళ్ల కాంగ్రెస్ టికెట్‌కు భలే డిమాండ్ ఉంది. రిజర్వ్‌డ్ స్థానమైన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి స్థానిక నాయకులే కాకుండా వలస నేతలు సైతం వస్తుండడంతో ఈ నియోజకవర్గానికి గిరాకీ పెరిగింది. గత ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన యాదయ్య టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన స్థానంలో పోటీచేయడానికి కాంగ్రెస్‌లో పోటీ నెలకొంది. పార్టీని నమ్ముకొన్న సీనియర్ నేత వెంకటస్వామి ఈసారి టికెట్టు లభిస్తుందని గంపెడాశతో ఉండగా తాజాగా టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే రత్నం తనకే టికెట్ దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. మరోవైపు మొదటి నుంచి ఈ సెగ్మెంట్‌పై కన్నేసిన రాచమల్ల సిద్దేశ్వర్ కూడా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. తనకు మాజీ మంత్రి సబిత, ఏఐసీసీ పెద్దల అండదండలతో అభ్యర్థిత్వం ఖరారవుతుందనే భరోసాతో ఉన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘం నేత పోచయ్య కూడా టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరందరిని కాదని అధిష్టానం మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ పేరును పరిశీలిస్తోందనే ప్రచారమూ జరుగుతోంది.
తాండూరులో కీచులాటలు
తాండూరు కాంగ్రెస్‌లో షరా మామూలుగానే వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. మొదటి నుంచి ఈ సెగ్మెంట్‌లో గ్రూపులుగా విడిపోయిన హస్తం నేతలు తాజాగా కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో బాబాయ్, అబ్బాయ్‌కే పరిమితమైన విభేదాలు ఈసారి కొత్తగా చేరిన పైలెట్ రోహిత్‌రెడ్డిని తాకాయి. ఎన్నికల వరకు ఒకరు.. టికెట్ కేటాయింపు వచ్చేసరికి మరోనేతను తెరమీదకు తెచ్చే
‘మహారాజ్ ఫ్యామిలీ’ ఈసారి కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. మొన్నటి వరకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన రమేశ్.. ఎన్నికల్లో పోటీ చేయలేనని విదేశీబాట పట్టగా తనకో, తన అన్న కొడుకు నరేశ్‌కో టికెట్టు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు పార్టీకి వెన్నంటి నిలిచిన తన పేరును పరిశీలించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి అభ్యర్థిస్తున్నారు. రాహుల్‌గాంధీని కలిసి పార్టీలో చేరిన రోహిత్ మాత్రం టికెట్టు తనకేననే ధీమాతో ఉన్నారు. మరోవైపు డాక్టర్ సంపత్ కూడా తెర వెనుక లాబీయింగ్ నెరుపుతున్నారు.
వికారాబాద్‌పై పీటముడి
వికారాబాద్ టికెట్ కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. 2014లో పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మరోసారి ఇక్కడి నుంచి రంగంలోకి దిగడానికి ఉబలాటపడుతున్నారు. అలాగే గత ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ కూడా ఈసారి బరిలో దిగాల్సిందేనని నిర్ణయించారు. కొన్నాళ్ల క్రితం ప్రసాద్ టీఆర్‌ఎస్‌లో చేరాలని భావించి చివరి నిమిషంలో రాహుల్‌గాంధీ జోక్యం చేసుకోవడంతో ఆగిపోయారు. దీంతో ఎలాగైనా తనకే టికెట్టు అనే భరోసాతో ఉన్నారు. ఇక మూడేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిన చంద్రశేఖర్‌కు శాసనసభ లేదా పార్లమెం టు బరిలో దిగే అవకాశం కల్పిస్తామని ఏఐసీసీ హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకోవాలని ఆయన ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. వీరిరువురిలో ఎవరికి టికెట్టు లభించినా మరొకరు సహాయ నిరాకరణ చేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
పట్నంలో పాత కథే!
ఇబ్రహీంపట్నంలో పాత కథే పునరావృతమవుతోంది. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య మరోసారి టికెట్టు పోరు ఏర్పడింది. గత ఎన్నికల్లో మల్లేశ్‌కు టికెట్టు లభించడంతో మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి మల్లేశ్‌ను మూడోస్థానానికి పరిమితం చేశారు. కాంగ్రెస్‌లో ఓట్ల చీలికతో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విజయం సులువైంది. ఈసారి కూడా మల్‌రెడ్డి, మల్లేశ్‌లు టికెట్ల వేటలో హస్తినకేగారు. ఎవరికివారు ఏఐసీసీ పెద్దలతో అభ్యర్థిత్వం ఖరారు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇక్కడ కూడా ఒకరికి టికెట్టు దక్కితే మరొకరు చేయిచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
రసకందాయంలో మేడ్చల్
మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వైఖరి కాంగ్రెస్‌లో కలవరం సృష్టిస్తోంది. పీసీసీ ‘ముఖ్య’నేతతో వైరం ఏర్పడడం.. అదికాస్తా తారాస్థాయికి చేరడంతో మనస్తాపానికి గురైన ఆయన తాజాగా జరిగే ఎన్నికల్లో పోటీపై వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వం అనుమానపు చూపులతో కినుక వహించిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారమూ లేకపోలేదు. ఈ పరిణామాలన్నింటికీ స్థానిక నేతలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, పార్టీ నేతలు నర్సింహారెడ్డి, తోటకూర జంగయ్యయాదవ్ స్థానికేతరుడిగా ముద్రిస్తుండడం.. గులాబీకి గూటికి చేరుతున్నారనే ప్రచారం వెనుక వీరి పాత్ర ఉందని కేఎల్లార్ విశ్వసిస్తున్నారు. దీంతో ఇక్కడి కాంగ్రెస్ మార్కు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.
అక్కడక్కడా చిటపటలు
మహేశ్వరంలో మాజీ మంత్రి సబిత పోటీచేయాలని భావిస్తుండగా.. అదే సీటుపై కన్నేసిన దేప భాస్కర్‌రెడ్డి టికెట్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో కార్తీక్‌రెడ్డి, ముంగి జైపాల్‌రెడ్డి మధ్య టికెట్టు వేట కొనసాగుతోంది. మల్కాజిగిరిలో నందికంటి శ్రీధర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ మధ్య, షాద్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, కె.శ్రీనివాస్ మధ్య పోటీ నెలకొంది. ఎల్‌బీనగర్, కుత్బుల్లాపూర్, పరిగి, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కల్వకుర్తిలో మాత్రం ఆశావహుల సంఖ్య ఒకిరికే పరిమితం కావడంతో ఇబ్బంది లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment