అమరులను కించపరిచిన ప్రధాని | tcongress leaders on state budget | Sakshi
Sakshi News home page

అమరులను కించపరిచిన ప్రధాని

Published Thu, Feb 8 2018 3:10 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

tcongress leaders on state budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ తలుపులు మూసేసి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం శోచనీయమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మోదీ అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. దీనికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు గురించి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే టీడీపీ, బీజేపీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడి ఆయన ప్రసంగానికి అడ్డుతగిలాయని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.  ప్రాణహిత– చేవెళ్లకు జాతీయహోదా, వరంగల్లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, తెలంగాణకు రావాల్సిన నిధులు గురించి పార్లమెంటులో అడిగే దిక్కులేకుండా పోయిందన్నారు.

నిధులు తేవడంలో సీఎం విఫలం: వీహెచ్‌
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేవడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆయన హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు మిగతాపార్టీలు కాంగ్రెస్‌తో కలసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికలతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్‌దే అధికారమన్నారు. ఆ భయంతోనే బోఫోర్స్‌ కుంభకోణాన్ని ప్రధాని మోదీ మళ్లీ తెరపైకి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను రాహుల్‌ గాంధీ అధికారంలోకి తెస్తారని దీమా వ్యక్తం చేశారు.

ఆర్థిక పరిస్థితి క్షీణించింది: శారద
సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల్లో మాటకు కట్టుబడి ఉండే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్‌ మాత్రమేనని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు పావలా వడ్డీకి రుణా లిచ్చామని గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థిక పరిస్థితి క్షీణించిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తీసుకునే నిర్ణయాలపై వనపర్తి సమావేశంలో కొన్ని ప్రకటనలు చేశామన్నారు. ఆసరా పెన్షన్‌ వచ్చే వారికి కూడా అభయ హస్తం వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement