అడ్డదారి ఆనంద్‌...విదేశాల్లో విలాసాలు | TDP Anakapalli MP Contestant Anand Corruption Track Record | Sakshi
Sakshi News home page

అడ్డదారి ఆనంద్‌...విదేశాల్లో విలాసాలు

Published Sun, Apr 7 2019 1:51 PM | Last Updated on Sun, Apr 7 2019 2:05 PM

TDP Anakapalli MP Contestant Anand Corruption Track Record - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పాడి రైతుల సహకార సంఘాల సమాఖ్యగా ఏర్పడిన విశాఖ డెయిరీని తర్వాతి కాలంలో  ప్రొడ్యూసర్స్‌ కంపెనీగా మార్చి.. చివరికి కుటుంబ సంస్థగా మార్చేసిన చరిత్ర ఆడారి తులసీరావుది. విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆయన చేసిన పా‘పాల’ చిట్టాను కదిలిస్తే తేనెతుట్టెను కదిలించినట్టే. ప్రస్తుతానికి ఆయన తనయుడు, డెయిరీ డైరెక్టర్, ఈ ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ టీడీపీ అభ్యర్ధి ఆడారి ఆనంద్‌ వ్యవహారాలను చూస్తే.. నాన్న చిట్టా కంటే చేంతాడంత పెద్దదిగానే కనిపిస్తోంది. విశాఖ డెయిరీ సొమ్ము.. అంటే పాడి రైతుల సొమ్ము. కానీ ఆ సొమ్మును  మొదటి నుంచి కుటుంబ ఆస్తులు పెంచుకునేందుకు మళ్ళిస్తూ వచ్చిన తులసీరావు.. ఇక కుమారుడు ఆనంద్‌ పెరిగి పెద్దయిన తర్వాతే విచ్చలవిడి దోపిడీకి తెరతీశారని చెప్పాలి.

ఆనంద్‌ విలాసాలు, విన్యాసాలు డెయిరీ పాలకవర్గ సభ్యులకే కాదు.. చాలామంది రైతులకు కూడా తెలియనివి కావు. రైతుల సొమ్మును ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసిన ఆనంద్‌ నిర్వాకం ఆయన వినియోగించే కార్లతోనే తెలుస్తుంది. మార్కెట్‌లో సరికొత్త లగ్జరీ కారు వస్తే.. అది ఆనంద్‌ ముంగిట్లో ఉండాల్సిందే. ఇప్పుడు ఆయన వాడుతున్న కార్ల విలువ రూ.12కోట్లపైనే అని అంటున్నారు. సరే.. ఆయన కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో వాటిని కొనుక్కుంటే ఎవరికీ నష్టం లేదు. కానీ అదంతా పాడి రైతులకు చెందిన డెయిరీ సొమ్మే కావడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

విదేశాల్లో విలాసాలు
ఆనంద్‌ అంటే.. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ విదేశీ విలాసాలు, జల్సాలు, నైట్‌ పార్టీలే గుర్తుకు వస్తాయి. నెలలో రెండు వారాలకు పైగా విదేశాల్లోనే ఆయన గడుపుతుంటారు. ఎక్కువగా బ్యాంకాక్‌లో షికార్లు చేస్తారని అంటుంటారు.  ఇక 2017లో తండ్రి తులసీరావుతో సహా కుటుంబ సభ్యులు చేసిన విదేశీ పర్యటన వివాదాస్పదమైంది. రోజుకు రూ.70లక్షలు ఖర్చు చేసి చార్టెడ్‌ ఫ్లైట్, స్పెషల్‌ యాచ్‌(ప్రైవేటు షిప్‌) తీసుకుని చేసిన ఈ టూరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తంగా 40రోజుల విదేశీ పర్యటనలో డెయిరీ సొమ్ము కోట్లు వృధా చేశారన్న వాదనలున్నాయి.

లెక్కలేనన్ని ఆర్ధిక వివాదాలు
విశాఖ డెయిరీకి అనుబంధంగా పాడి రైతుల సంక్షేమం కోసం నగరంలోని షీలానగర్‌ వద్ద ఆస్పత్రి నిర్మించారు. డెయిరీకి పాలు సరఫరా చేసే ప్రతి రైతుకు ఈ ఆస్పత్రిలో కార్పొరేట్‌ వైద్యాన్ని తక్కువ రుసుంతోనే అందిస్తున్నట్లు ప్రకటించారు. తదనంతరం ఆస్పత్రి నిర్వహణను తులసీరావుకు బంధువైన ఓ ప్రముఖ వైద్యుడికి నెలకు అధిక మొత్తంలో లీజ్‌ చొప్పున ఐదేళ్లపాటు ఇచ్చారు. సదరు వైద్యుడు ఆ ఆస్పత్రిని కృషి ఐకాన్‌సంస్థకు అమ్మేశారు. దీంతో  రైతులకు సేవలందించాల్సిన ఈ డెయిరీ ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిగా మారిపోయి.. వైద్యాన్ని ఖరీదు వ్యవహారంగా మార్చింది. ఈ వ్యవహారంలో రూ.50 కోట్లు గోల్‌మాల్‌ అయినట్లు ఆరోపణలున్నాయి. డెయిరీ నిధులతోనే ఆడారి ఆనంద్, ఆయన సోదరి రమాకుమారి పేరిట ఈ మధ్యనే సుమారు 66 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇటీవల కుటుంబ ఆస్తులపై ఐటీ దాడులు జరిగినప్పుడు ఐటీ డిపార్టుమెంట్‌కు చెల్లించాల్సిన రూ.8 కోట్లను విశాఖ డెయిరీ నిధుల నుంచే చెల్లించారంటే డెయిరీ సొమ్మును ఎలా వాడేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలా డెయిరీని పీల్చి పిప్పి చేసిన ఆడారి ఆనంద్‌ అండ్‌ కో ఇప్పుడు ఎన్నికల ఖర్చులకు డెయిరీ నిధులనే మళ్ళిస్తోంది

డెయిరీ లేని చోట గెస్ట్‌హౌస్‌లు
విశాఖ డెయిరీ కార్యకలాపాలు ప్రధానంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. కానీ డెయిరీ గెస్ట్‌ హౌస్‌లు మాత్రం ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో.. మొత్తంగా ఎనిమిది ఉండటంపైనా వివాదం రేగుతోంది. డెయిరీ కార్యకలాపాలే లేని మెట్రో నగరాల్లో వసతి గృహాలు, విడిది కేంద్రాలు ఎందుకయ్యా అంటే.. కేవలం ఆడారి ఆనంద్‌ విలాసాలకేనన్నది డెయిరీ వర్గాలకు తెలిసిన బహిరంగ రహస్యం. ఆ గెస్ట్‌హౌస్‌ల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు మొత్తం విశాఖ డెయిరీ అకౌంట్ల నుంచే వెళ్తున్నాయనేది పచ్చినిజం. ఇక మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆనంద్‌ సహా కుటుంబ సభ్యుల పేరిట ఆ మధ్యే ఓ డెయిరీని నెలకొల్పారు. దానికి ప్రతి రోజూ విశాఖ డెయిరీకి చెందిన  రెండు ట్యాంకుల పాలను ఇక్కడి డెయిరీ లెక్కల్లోకి రాకుండా తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లేదు. 

కొసమెరుపు
జీవితమంటే వ్యసనాలు, విలాసాలే అన్నట్లు ఎ’దిగిన’ ఆడారి ఆనంద్‌ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసి.. టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి జనాలను ఉద్ధరించేస్తానంటూ సుద్దులు చెప్పడం, ప్రతిపక్ష పార్టీ నేతలను నోటికొచ్చినట్టు మాట్లాడటమే విడ్డూరంగా అనిపిస్తోంది.. ఏమంటారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement