సాక్షి, చిత్తూరు : వెన్నుపోటు రాజకీయాలే కాదు పొత్తులు పెట్టుకోకుండా గెలిచిన చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదనే విషయం బహిరంగ రహస్యమే. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తే ఫలితం ఉంటుంది అనే విషయంపై ఆయనకు ఒక లెక్క ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కొన్ని ‘భేదాభిప్రాయాలు’ రావడంతో.. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. ఏపీలో మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరుపార్టీల మధ్య లోపాయికారి పొత్తు కొనసాగుతున్న విషయం బహిర్గతమవుతోంది. ఇందుకు చంద్రగిరి మండలంలో జరిగిన ప్రచార కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.
అలా చెప్తాం అంతే..
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్తపేటలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కుటుంబ సభ్యులతో పాటుగా.. కాంగ్రెస్ చిత్తూరు ఎంపీ అభ్యర్థి రంగప్ప.. చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి వాసులు కలసి ప్రచారం నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విధంగా కాంగ్రెస్, టీడీపీ నేతలు కలసి ప్రచారం నిర్వహించడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు మార్కు ‘పాలిట్రిక్స్’ తెలిసిన వాళ్లు మాత్రం ఇది మాకేం కొత్తకాదుగా అని సరిపెట్టుకుంటున్నారు. ఇక జనాదరణతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక.. చంద్రబాబు ఇప్పటికే పవన్ కల్యాణ్, కేఏ పాల్ వంటి వారితో ‘ముసుగు రాజకీయాల’ కు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.(చదవండి : పులివర్తి నాని బంధుగణం దౌర్జన్యకాండ)
Comments
Please login to add a commentAdd a comment