సాక్షి, భీమవరం: ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన భీమవరం ఒకప్పుడు అధికారపార్టీకి కంచుకోట. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి గతంలో ఆ పార్టీ నేతలు క్యూ కట్టేవారు. పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంట. భీమవరంలో పోటీ అంటేనే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారంట. ప్రస్తుతం ఎమ్మెల్యే అంజిబాబు మళ్లీ పోటీకి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతున్నా.. దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఆయనపై ఈ ఐదేళ్లలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది.
దీంతో ప్రత్యామ్నాయం కోసం పార్టీ అధిష్టానం చూస్తోందట. దాదాపు 2.30 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ఆర్థిక సంపన్నులకు కొదవ లేదు. అయితే ఈ ఎన్నికల్లో అధికారపార్టీ తరఫున పోటీ చేయడానికి వారెవరూ ముందుకు రావడం లేదట. 2014ఎన్నికల్లో టీడీపీ నుంచి తోట సీతారామలక్ష్మి, మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు, పోలిశెట్టి సత్యనారాయణ, వీరవల్లి చంద్రశేఖర్ తదితరులు పోటీపడ్డారు. టికెట్ కోసం చివరి నిమిషం వరకూ విఫలయత్నం చేశారు.
అయితే అప్పటి వరకు కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు)కు టీడీపీ అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. దీంతో ఎన్నోఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి కాంగ్రెస్‌పార్టీ నుంచి వచ్చిన అంజిబాబు కు టికెట్ ఎలా ఇస్తారంటూ ఆ పార్టీ వారు అలకబూనారు. ప్రస్తుతం టీడీపీ ప్రతిష్ట పూర్తిగా మసకబారడంతో పోటీకి ఆ నాయకులెవరూ ఆసక్తి చూపడం లేదు. నెల రోజుల ముందు వరకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి కుమారుడు జగదీష్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగినా.. పార్టీ అధినేత సమీక్షలో పోటీకి ఎవరూ ముందుకు రాలేదంట. ప్రస్తుతం వ్యతిరేకత బాగా ఉందని.. ఇప్పుడు పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమనే భావనతోనే ఎవరూ నోరెత్తడం లేదట. అందుకే గత్యంతరం లేకే అధినేత మళ్లీ అంజిబాబుకు టికెట్ ఖరారు చేశారనే గుసగుసలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment