జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏమైంది. ఆయన ఏదిపడితే అది మాట్లాడి పరువు తీసుకుంటున్నారు. ప్రజల సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీలోనే అప్రతిష్టపాలు అవుతున్నారు. టీడీపీకి బానిసత్వం చేస్తున్నారని విమర్శ ఎదుర్కొంటున్న పవన్.. తాజాగా ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యేను జనసేనలో చేర్చుకున్న తీరు చూశాక ఈయన మరింత దిగజారిపోయారని అర్ధం అవుతుంది. భీమవరం సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. కానీ అక్కడ ఆయన తన పార్టీ కోసం పనిచేసేవారికి ఇవ్వడం లేదు. తెలుగుదేశం నుంచి అరువుతెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పి.రామాంజనేయులుకు ఇస్తున్నారు. అంటే అక్కడ జనసేనకు అభ్యర్ధులే కరువు అయ్యారా !
జనసేనలోకి టీడీపీ నేత.. అర్థమేంటి?
ఒకవేళ ఉన్నా చంద్రబాబు అదేశాల మేరకు కిక్కురుమనకుండా ఆ పార్టీ వ్యక్తికి టిక్కెట్ ఇస్తున్నారా! నామ్ కే వాస్తే టీడీపీ నుంచి జనసేనలోకి తీసుకు వచ్చి కథ నడిపించారా అన్న డౌటు వస్తుంది. పొత్తులు కుదరకముందు సంబంధిత పార్టీల నుంచి ఫిరాయింపులకు అవకాశం ఇచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు. కాని టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఇలా ఫిరాయింపులు జరుగుతాయా?. ఫిరాయింపు జరిగితే దానిని టీడీపీ అంగీకరిస్తుందా. టీడీపీ తన నేతను జనసేనలోకి పంపిందంటే దాని అర్ధం ఏమిటి? సాధారణంగా అయితే పొత్తులో ఉన్న పార్టీల మధ్య పార్టీ మార్పిడులు జరిగితే పెద్ద గొడవ అవుతుంది.
పవన్ తాపత్రయం ఒక్కడు గెలవడం కోసమా?
అలాకాకుండా చంద్రబాబు నోరు విప్పలేదంటే దాని అర్దం తన అనుమతి మేరకే అలా జరిగిందని తేలడం లేదా. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేయడానికి ఎవరైనా సిగ్గుపడాలి. అలా సిగ్గుపడకపోగా, పవన్ సొంత పార్టీవారిని అవమానిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. 'మనం ఎక్కువ సీట్లు తీసుకున్నాం.. తక్కువ సీట్లు తీసుకున్నాం అని ఆలోచించకండి’ అని ఆయన చెబుతున్నారు. జనసేనకు సీట్లు తగ్గిపోయాయని అందరూ అంటున్నారు. 2019 ఎన్నికలలో నా ఒక్క సీటు గెలిచినా ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది అని పవన్ అన్నారు. అంటే ఇప్పుడు తాపత్రయం అంతా తను ఒక్కడే గెలవడం కోసమా?.
ఆ వైఫల్యం పవన్‌దే కదా..
2019లో చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం కోసం పవన్ కల్యాణ్ బీఎస్సి, వామపక్షాలతో కలిసి పోటీచేశారు. దీనికి ఆయనే బాధ్యత వహించాలి తప్ప ఎవరిని తప్పు పడతారు? తను ఒక్కడే గెలవకపోవడానికి తన వైఫల్యం అవుతుంది తప్ప కార్యకర్తలు ఏమి చేయాలి. జనంలో ఆదరణ లేనప్పుడు. అసలు మండలాల వారీగా పార్టీ నిర్మాణమే చేయలేకపోయిన వైఫల్యం పవన్‌దే కదా! ఇంకో రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అవ్వాలని జనసైనికులు, కాపు సామాజికవర్గం వారు కోరుకోవడమే తప్పు అనుకోవాలి.
అక్కసు, ద్వేషాన్ని కక్కిన పవన్
వ్యక్తిత్వం లేని పవన్ కల్యాణ్ వంటివారు వేరొకరికి ఇంత దారుణంగా సరెండర్ అవుతారని ఆయన అభిమానులు ఊహించలేకపోవడం వారి తప్పు అని భావించాలి. మరికొన్ని వ్యాఖ్యలు చూడండి. భీమవరం అత్యంత కుబేరులు ఉన్న నగరం అట. ఒక రౌడీ చేతిలో ఇరుక్కుపోయిందట. భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్‌ను తరిమివెయ్యాలని ఆయన అన్నారు. అతనేమైనా మంచివాడా? సమాజానికి అండగా ఉండేవాడా? కాపు కులస్థుడే కావచ్చు. అంటూ ఏదేదో మాట్లాడి సభలో ఉన్నవారందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రిని పట్టుకుని క్రిమినల్ అని, తనను ఓడించిన ఎమ్మెల్యేని రౌడీ అని అనడం ద్వారా పవన్ తన అక్కసు, ద్వేషాన్ని వెలిబుచ్చారు.
పవన్ రౌడీ కాదా?
నిజానికి ఎవరు క్రిమినల్? ఎవరు రౌడీ? వైఎస్సార్‌సీపీ నేతలను బట్టలూడదీసి కొడతానని పెద్ద గొంతు వేసుకుని అరచిన పవన్ రౌడీ అవుతారా? లేక ప్రజలకు ఉపయోగపడడం కోసం సొంత భూమిని దానం చేసిన గ్రంధి శ్రీనివాస్ రౌడీ అవుతారా? మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా అదేదో ఘనకార్యంలా చెప్పుకోవడం, అక్కడితో ఆగకుండా భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం క్రిమినల్ చర్య అవుతుందా? లేక అలా చేయకుండా, రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం పలు స్కీములు తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి క్రిమినల్ అవుతారా?
ఏం చేస్తానో చెప్పలేని స్థితిలో పవన్
పవన్ తాను గెలిస్తే ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం జగన్ అమలు చేస్తున్న స్కీములపై ఆయన వైఖరి ఏమిటి?పాలనలో తీసుకు వచ్చిన మార్పులను ఎలా చూస్తారు? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీల ఏర్పాటు, స్కూళ్ల బాగుచేత, తదితర చర్యలు రాష్ట్రాన్ని నాశనం చేస్తాయా? లేక అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను నాశనం చేసిన వ్యక్తి వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందా? తనే గతంలో అమరావతిని కుల రాజధాని అని ఎందుకు అన్నారు? ఇలాంటి వాటిపై మాట్లాడడానికి తన వద్ద ఎలాంటి సరుకు లేకపోవడం వల్ల రౌడీ, క్రిమినల్ వంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ మిగిలిన విషయాలతో పాటు ఇలా రాజకీయ ప్రత్యర్ధిపై వ్యక్తిగత ఆరోపణలు చేసి బురదచల్లడం కూడా చంద్రబాబు నుంచే ట్రైనింగ్ పొందినట్లు అనిపిస్తుంది.జగన్ ను ఓడించలేకపోతున్నామన్న దుగ్దతో పవన్ కల్యాణ్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అసూయ మరీ ఎక్కువైతే ఆయనకే అనారోగ్యం . ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకుని మాట్లాడితే మంచిది.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment