
ఎన్నికల ప్రచారంలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: పోలింగ్ ముంగిట టీడీపీ నేతలు పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ, విపక్షంపై దుష్ప్రచారానికి తెరతీశారు. ఆ పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాలు రోజుకోవిధమైన తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండురోజుల క్రితం ఎల్లో మీడియాకు చెందిన ఒక ఛానల్.. ఎంపీ విజయసాయిరెడ్డి, మరో నాయకుడితో మాట్లాడుతున్నట్లుగా ఒక ఆడియో టేపును ప్రసారం చేసి ఏదో జరిగిపోతోందనే హడావుడి చేసింది. నిజానికి ఆ ఆడియో టేపులో గొంతుకు, విజయసాయిరెడ్డి గొంతుకు సంబంధం లేనట్లు స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. అయినా దాన్ని ప్రసారం చేయడం ద్వారా ఆ ఛానల్ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. మరోవైపు టీడీపీ నాయకులు ఐదేళ్లలో అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బులు పంపిణీ చేస్తున్న తెలుగుదేశం నాయకులను పలుచోట్ల పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. పెద్దయెత్తున తరలిస్తున్న నగదును కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
ప్రతి నియోజకవర్గంలో రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు డబ్బు వెదజల్లేందుకు టీడీపీ నేతలు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఓటుకు ఐదు వేల చొప్పున పంచుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరంలో ఓటుకు మూడు వేలు పంపిణీ చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం, విజయవాడ సెంట్రల్, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో మొదటి విడతలో భాగంగా రూ.1,000, రూ.2,000 చొప్పున టీడీపీ నేతలు పంపిణీ చేస్తున్నారు. మంత్రులు గుంటూరులో పుల్లారావు, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు కూడా అవినీతి సొమ్మును భారీగీ వెదజల్లుతున్నారు. విశాఖ నార్త్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి అయ్యన్నపాత్రుడు విపరీతంగా డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తోంది.
మద్యం పట్టివేత..
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో టీడీపీ నేత ఆళ్ల వీరారెడ్డి అలియాస్ మున్నంగి వీరారెడ్డికి చెందిన గోడౌన్‌లో ఆదివారం రాత్రి 562 మద్యం (క్వార్టర్లు) సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ గతంలో వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అయితే ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసేందుకు టీడీపీ నాయకులే మద్యం నిల్వ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెనాలి నాజరుపేట శివారులో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ముందు, రోడ్డు వెంబడి 90 క్వార్టర్ల చీప్ లిక్కర్ సీసాల బస్తాను వన్‌టౌన్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున గుర్తించి స్వాధీనపర్చుకున్నారు.
బుడ్డా వాహనంలో రూ.10 కోట్లు?
కర్నూలు/ఓర్వకల్లు/ సాక్షి నెట్‌వర్క్: ఆదివారం కర్నూలు జిల్లా నన్నూరు టోల్‌ప్లాజా వద్ద కర్నూలు వైపు నుంచి వేల్పనూరు వైపు వెళుతున్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఏపీ 21బీయూ 0009 నంబరు గల స్కార్పియో వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఫ్రీ రోడ్డు గుండా వచ్చిన స్కార్పియో డోర్‌ను తెరిచినట్టే తెరిచి, తనిఖీకి ప్రయత్నిస్తున్న ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ శ్రీనివాసులును నెట్టేసి వేగంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ ప్రతిఘటించి కొద్దిదూరం వరకు వాహనాన్ని వదలకుండా వేలాడుతూ వెళ్లారు. ఆ తర్వాత వాహన వేగాన్ని తగ్గించిన వాహనంలోని వ్యక్తులు.. శ్రీనివాసులును గెంటేసి పరారయ్యారు. టోల్‌ప్లాజా వద్దనున్న సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా వాహనం నంబర్‌ను గుర్తించి ఆన్‌లైన్‌లో పరిశీలించగా.. సదరు వాహనం శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఉన్నట్లు తేలింది. ఈ వాహనంలో రూ.10 కోట్ల నగదు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బుడ్డా ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎన్నికల ఖర్చుకు హామీ లభించడంతో తిరిగి పోటీలో నిలిచారు. కేసు నమోదు కానుందన్న సమాచారం అందుకున్న బుడ్డా అనుచరులు వాహనాన్ని సోమవారం ఉదయం అప్పగిస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది.
పట్టుబడ్డ డబ్బులతో నిందితులను చూపిస్తున్న సంతమాగులూరు ఎస్సై నాగరాజు
అద్దంకిలో.. రూ.4.3 లక్షలు స్వాధీనం
ఓటరు లిస్టు పట్టుకొని నగదు పంపిణీ చేస్తున్న టీడీపీ మద్దతుదారులను ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసుమర్తిపాలెం ప్రాంతంలో డబ్బు పంచుతున్న బల్లికురవ మండలం కొనిదెనకు చెందిన శాఖమూరి అశోక్ నుంచి రూ.51 వేలు, గుంటూరుకు చెందిన బి.రాజేష్ నుంచి రూ.1,27,500 నగదు, మద్యం బాటిళ్లు, మరి కొందరి నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నట్లు అద్దంకి ఎస్‌ఐ సుబ్బరాజు తెలిపారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల పైలాన్ వద్ద బీఎస్సీ తరపున నగదు పంచుతున్న ఆకునూరి సీతారాంబాబు నుంచి రూ.80 వేలు స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక ఎస్‌ఐ తెలిపారు. సంతమాగులూరు మండలం వెల్లలచెరువు, ఏల్చూరు గ్రామాల్లో రూ.60 వేలు పంచుతూ టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఏల్చూరు వడ్డెర కాలనీలో డబ్బులు పంచుతున్న వేముల కుమార్‌ను అదుపులోకి తీసుకొని రూ.1.77 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment