సాక్షి, అమరావతి: పార్టీ అభ్యర్థుల ఎంపికను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసి, ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి ప్రచారం ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆదివారం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. ఇంకా 60కి పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత రాలేదు. మరో మూడు రోజుల్లో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చారు. ఎంపిక పూర్తి చేశాక 175 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలా లేక ముందు 100 నుంచి 115 స్థానాలకు మాత్రమే ప్రకటించాలా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటనను బట్టి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. సందిగ్ధంలో ఉన్న స్థానాలపై చర్చించేందుకు, అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే బాధ్యతను సీనియర్ నేతలు సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడికి అప్పగించారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వెంటనే 16, 17 తేదీల నుంచి తాను ఎన్నికల ప్రచారానికి బయలుదేరతానని సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని పార్టీ ముఖ్యులను ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు, అక్కడి కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
శ్రీకాకుళం నుంచి బాబు ఎన్నికల ప్రచారం
ఎన్నికలకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ఇంటి ఇలవేల్పు తిరుమల వెళ్లి, స్వామివారి దర్శనం చేసుకుంటానని, అనంతరం శ్రీకాకుళం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు. ప్రతి చోటా బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో మాట్లాడుతానని, కార్యకర్తలు, నాయకులను ఎన్నికలకు సంసిద్ధం చేస్తానని అన్నారు. టీడీపీ గ్రాఫ్ పెరుగుతోందని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో చంద్రబాబు ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, చెప్పనివి కూడా 40కి పైగా చేశామని చెప్పుకొచ్చారు.
ఐదేళ్లలో పెద్దఎత్తున అభివృద్ధి చేశామని వివరించారు. ఓటర్ల జాబితాలో ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని చంద్రబాబు కోరారు. లేకపోతే ఫారం–6 ద్వారా ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎందుకు హైదరాబాద్‌ను వదిలిరావడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షా సమయమని అన్నారు. ఈ ఎన్నికల్లో ‘మీ భవిష్యత్తు–నా బాధ్యత’ అనేది తమ ఎన్నికల నినాదమని వెల్లడించారు.
రెండు మూడు రోజుల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి
Published Mon, Mar 11 2019 3:49 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment