
నందిగామ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో త్వరలో ఆ పార్టీలో చేరబోతున్నట్లు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ చెప్పారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరంలోని తన స్వగృహంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్‌లో ఉన్న తన వర్గీయులు కూడా పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
వారందరితో కలిసి త్వరలో భారీ ర్యాలీగా వెళ్లి పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసి పార్టీ కండువా కప్పుకుంటానని చెప్పారు. ‘నేను పార్టీ మారుతున్నట్లు తెలియడంతో సీఎం చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. గుంటూరు సీటు ఇస్తానని నాకు హామీ ఇచ్చారు. కానీ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను’ అని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.