అధికారంలో ఉన్నన్నాళ్లూ వారు చెప్పిందే వేదం. వారి మాటే శాసనం. అధికార బలంతో అక్రమాలు, అవినీతికి అలవాటు పడ్డారు. ప్రజాధనాన్ని లూటీ చేశారు. వీరికి ఓటు రూపంలో జనం బుద్ధి చెప్పారు. అయినా వారిలో మార్పు రాలేదు. నాటి జులుంనే నేడూ ప్రదర్శిస్తున్నారు. ప్రశాంతమైన పల్లెల్లో తగువుల చిచ్చురేపుతున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై తెగబడుతున్నారు. తిరిగి కేసుల్లో ఇరికిస్తున్నారు. సభ్యసమాజం ఛీత్కరిస్తున్నా వారి నైజం మారకపోవడం, శాంత్రిభత్రలకు విఘాతం కల్పించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నాటి నుంచి జిల్లాలో టీడీపీ శ్రేణులు అవమానభారంతో అనవసర తగవులకు దిగుతున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ కార్యకర్తను హత్యచేశారు. తాజాగా చీపురుపల్లి, గజపతినగరం, సాలూరు నియోజక వర్గాల్లో వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. తిరిగి వారిపైనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి తప్పుడు కేసులు పెట్టారు. దీనికోసం పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. టీడీపీ పెద్దల డైరెక్షన్‌లోనే ఈ తతంగమంతా సాగుతోంది. గ్రామ స్థాయిలో ఘర్షణలు సృష్టించి, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం వల్లనే ప్రశాంత వాతావరణం కరువైందనే భావాన్ని ప్రజల్లో కలిగించాలన్న లక్ష్యంతో గొడవలు సృష్టిస్తున్నారు. ఇరువర్గాలపైనా కేసులు నమోదయ్యేలా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
జనాన్ని వెంటాడుతున్న దాడుల భయం..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాచిపెంట మండలంలోని పి.కోనవలస, మోసూరు గ్రామాల్లో ఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. పి.కోనవలసలో జరిగిన ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కరణం రాజు కుటుంబం దెబ్బలతో తప్పించుకున్నారు. మోసూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త గండిపల్లి తవుడును టీడీపీ వర్గీయుడు హతమార్చారు. ఈ కేసు విచారణలో ఉంది. మెం టాడ మండలంలోని తమ్మిరాజుపేటలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయుకులు దాడిచేసి గాయపరిచారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రెండువర్గాల వారూ గాయాలపాలయ్యారు. పైపెచ్చు ముగ్గురు బాధితులపై ఆండ్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఇరువర్గాలపైనా కేసు నమోదు చేసి ఇరువర్గాలకు చెందిన 30 మందిపై బైండోవర్ నమోదు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు.
మెరకముడిదాం మండలం భగీరథపురంలో అక్టోబర్ 30వ తేదీన కంచెమ్మతల్లి జాతర సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా జరిగిన వివాదంలో టీడీపీ నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకులపై చేసిన దాడిలో వైఎస్సార్ సీపీకి చెందిన గేదెల తిరుపతి గాయపడ్డాడు. దీంతో ఇరువర్గాల వారు తోపులాటకు దిగారు. దీంతో ఇరుగువర్గాలను చెదరగొట్టిన బుదరాయవలస పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలైన గేదెల తిరుపతి, గేదెల రాము, జమ్ముకృష్ణ, చిట్టిజన, చందక రాము, గేదెల రామ్మోహనరావులపైన, టీడీపీ నాయకులైన పల్లి లక్ష్మణ, పల్లి సింహాచలం, పల్లి చిన్నంనాయుడు, పల్లి గౌరినాయుడు, చిట్టిరాములపై 354–బి,324, 509, 323, రెడ్ విత్ 34 సెక్షన్‌ల కింద ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. గజపతినగరంలో వైఎస్సార్ సీపీ నాయకులు కొండపల్లి కొండలరావుపై తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు భూ వివాదాన్ని సృష్టించి గంట్యాడ పోలీసు స్టేషన్‌లో కొద్దిరోజుల కిందట ఫిర్యాదు చేశారు.
కుట్రలెన్ని చేసినా ప్రజల నుంచి దూరం చేయలేరు..
ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూసి టీడీపీ వారు తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలవడం, సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తుండడంతో ఓర్వలేకపోతున్నారు. గొడవలను సృష్టిస్తున్నారు. నాయకులు వెనుకను ఉంటూ కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారు. తిరిగి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపైనే పోలీస్ కేసులు పెడుతున్నారు. వారెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో మాకు, మా పార్టీకి ఉన్న ఆదరణను ఏ మాత్రం తగ్గించలేరు. ప్రజల కోసం ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించడమే ధ్యేయంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సహనంతో పని చేస్తున్నారు. ఖాళీగా కూర్చున్న, టీడీపీ వారితో అనవసర గొడవలు పెట్టుకునేంత తీరిక, సమయం మాకులేవు. కావాలని రెచ్చగొడితే మాత్రం వారిపై చట్టపరంగా ముందుకు వెళతాం.
–మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment