గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో పరామర్శిస్తున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
అనంతపురం న్యూసిటీ: ‘‘రాప్తాడులో శాంతిభద్రతలు చచ్చిపోయాయి. ఖాకీ చొక్కా వేసుకున్న నిజమైన పోలీసులు కనపడి ఐదేళ్లు అయ్యింది.’’ అని వైఎస్పార్ సీపీ రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో గాయపడి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులను ఆయన శనివారం పరామర్శించారు. గాయపడిన చింతకాయల పోతులయ్య ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన సేవలందించాలని కోరారు. అనంతరం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్‌ఎస్ గేట్‌లో దాడులకు పాల్పడిన వారిని ప్రజలే పట్టించినా ఎస్‌ఐ కనుసైగలు చేసి పారిపోమనే పరిస్థితులు ఉన్నాయి.
గత ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోరు. ధర్మవరం డీఎస్పీ, ఆత్మకూరు సీఐ.. జిల్లా ఎస్పీ సహా తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినైనా కొట్టచ్చు. వైఎస్సార్ సీపీ నాయకులు ప్రాణాలమీదకొచ్చినా, ఆస్పత్రుల్లో అడ్మిట్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ఒకవేళ కేసులు కట్టినా బెయిలబుల్ సెక్షన్ల(324, 326)తో సరిపెడుతారు. ఐదేళ్లలో నలుగురు నాయకులను పొట్టనపెట్టుకున్నారు. పోలీసులు కేఎన్ పాళ్యం, కందుకూరులో మర్డర్ కేసులో ఉన్న ముద్దాయిలను తీసుకొచ్చి ఓటు వేయించారు. ఈ విషయంలో స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. జిల్లాలో ఎక్కడ హత్య జరిగినా మంత్రి పరిటాల సునీత ఇంటి వద్ద ఆశ్రయమిస్తారు. ఆ విషయం జిల్లా ఎస్పీకి కూడా తెలుసు.’’
శ్రీరాం ‘బాబు’గానే కన్పిస్తాడు
‘రాప్తాడులో జరిగిన హత్యలకు ప్రధాన కారకుడు మంత్రి కుమారుడు పరిటాల శ్రీరాం అని తెలిసినా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇదే విషయమై ఫిర్యాదు చేస్తే ఆ బాబు అలాంటి వ్యక్తి కాదని వెనుకేసుకొస్తారు. ఎస్పీకి శ్రీరాం ‘బాబు’గానే కన్పిస్తారు కానీ ముద్దాయిగా కన్పించడు. శవ పంచనామలో, ఎఫ్‌ఐఆర్‌లో శ్రీరాం పేరు నమోదు చేయాలని బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినా ఎక్కడా నమోదు చేయట్లేదు. రాప్తాడు నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ తిరగలేని పరిస్థితి.
శ్రీరాం యువసేన పేరుతో రౌడీషీటర్లు(ధర్మవరం) అమాయకులపై దాడులు చేస్తున్నారు. ఎన్‌ఎస్ గేట్ యూత్ కన్వీనర్‌పై దాడిని స్థానిక ప్రజలు కండించడంతో పోలీసులు కేసు కట్టారు. కేసు కట్టనివి ఎన్నో ఉన్నాయి. తోపుదుర్తి గ్రామంలో పోలింగ్ రోజున పరిటాల శ్రీరాం వచ్చి ప్రజలపై రాళ్లు రువ్వి, దాడులు చేసినా ఆయనపై కేసు కట్టడంతో పాటు అమాయక ప్రజలపైనా కేసులు పెట్టారు. అదే గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకున్ని తెలుగుదేశం నాయకులు చెప్పుతో కొట్టారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఈ విషయమై డీఎస్పీ, సీఐను ఆరా తీస్తే ఎస్పీ ఒత్తిడి పెడుతున్నారని చెప్పారు. ఎస్పీ ప్రభుత్వంతో జీతం తీసుకుంటున్నారా? లేక ఎవరితో జీతం తీసుకుంటున్నారో ఆలోచన చేయాలి. ఎస్సీకి చెందిన దళిత రాజన్న అనే వ్యక్తి టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు.’
ఓటమి భయంతోనే దాడులు
‘‘ఈ ఎన్నికలు ప్రజలు, పరిటాల కుటుంబం మధ్య జరిగాయి. ఓటమి భయంతోనే పరిటాల శ్రీరాం ప్రతి గ్రామంలో వర్గాలు, కక్షలు రేకెత్తిస్తున్నారు. నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌కు తిరిగి బీజం వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చట్టం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. సరైన పోలీసు అధికారులతో శాంతిభద్రతలు కాపాడుతాం.’’ అన్నారు. ప్రకాష్ రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, నాగసముద్రం యూత్ మండల కన్వీనర్ ఓబులేసు, తదితర గ్రామస్తులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment