వరదలు, కరవు వంటి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు.. అదీ రూ.ఐదు లక్షల్లోపు విలువైనవి మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. దీన్ని గత టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు.
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్‌ను గుర్తించడానికి ‘ర్యాపిడ్ టెస్ట్ కిట్ల’ కొనుగోలులో అత్యంత పారదర్శకంగా వ్యహరించిన రాష్ట్ర ప్రభుత్వంపై అభూతకల్పనలు వల్లె వేస్తూ అక్రమాలు జరిగాయని గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోన మండలి) ఒక్కో కిట్‌ను రూ.795కు కొనుగోలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.730కే కొనుగోలు చేసింది. అంటే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేసిన ధర కంటే రూ.65 తక్కువకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశంలో తాము కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ ధరకు ఏ రాష్ట్రానికైనా విక్రయిస్తే.. అదే ధరను తమకూ వర్తింపజేయాలని కొనుగోలు ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం షరతు కూడా పెట్టింది.
ఈ షరతు వల్ల ప్రజాధనం ఆదా అవుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తూ అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుండటాన్ని సామాజికవేత్తలు తప్పుపడుతున్నారు. ఈ సందర్భంగా ఐదేళ్ల టీడీపీ పాలనలో కృష్ణ పుష్కరాల ఏర్పాట్ల దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు పనుల వరకూ అత్యవసరం కాకపోయినా... రూ.25 వేల కోట్లకుపైగా విలువైన పనులను ‘కోటరీ’ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు ‘నోటి మాట’పై నామినేషన్ విధానంలో కట్టబెట్టిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ నేతల తీరు చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అని అరుస్తున్నట్లుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి బాహాటంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పని చేయవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించడాన్ని పలువురు వైద్య నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే వైద్య ఆరోగ్య విషయాలపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని స్పష్టమవుతోందన్నారు.
ఏ రాష్ట్రానికైనా తమ కంటే తక్కువ ధరకు సరఫరా చేస్తే తామూ అదే ధర చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు ఒప్పందంలోని షరతు
అత్యవసరంలోనూ అత్యంత పారదర్శకత
► కోవిడ్–19 వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా కేంద్రం మార్చి 24 నుంచి లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తూ అనేక చర్యలు చేపట్టింది.
► ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా కోవిడ్–19 వైరస్ నివారణా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా అతి తక్కువ కాలంలోనే తొమ్మిది ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. మరో 12 ల్యాబ్‌లు వారంలోగా అందుబాటులోకి తేనుంది.
► ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రపంచంలో 210 దేశాల్లో 24.23 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో.. ర్యాపిడ్ టెస్ట్ కిట్లకు అమాంతం డిమాండ్ ఏర్పడింది. దీంతో ర్యాపిడ్ టెస్టు కిట్లను ఏ ఏ సంస్థల నుంచి కొనుగోలు చేయాలన్న అంశంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలు జారీ చేసింది.
► ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన కంపెనీలు.. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల సరఫరాపై తమ తమ కొటేషన్లను సంబంధిత డీలర్ల ద్వారా దేశంలో పలు రాష్ట్రాలకు సమర్పించినట్లే మన రాష్ట్రానికి కూడా సమర్పించాయి. ఐసీఎంఆర్ కూడా అవే కంపెనీల నుంచి కొనుగోలు ప్రారంభించింది.
► చైనాకు చెందిన ‘లివి కాన్ డయాగ్నస్టిక్స్’ నుంచి ఒక్కో ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను రూ.795 వంతున ఐసీఎంఆర్ రెండు లక్షల కిట్లను కొనుగోలు చేసింది. కర్ణాటక ప్రభుత్వం కూడా అదే సంస్థ నుంచి ఒక్కో కిట్‌ను రూ.795 చొప్పున 50 వేల కిట్లు కొనుగులు చేసింది.
► ఇదే సమయంలో దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయో సెన్సర్స్ సంస్థ నుంచి ఒక్కో కిట్ రూ.730 చొప్పున రెండు లక్షల కిట్లను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఒప్పందం చేసుకుంది. తాము కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ ధరకు దేశంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తే.. అదే ధరతో తాము చెల్లింపులు చేస్తామని ఆ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం షరతు విధించింది.
► మన రాష్ట్రం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యేవి. ఇప్పుడు ఆ కిట్లను మన దేశంలోనే తయారు చేయడానికి అదే కంపెనీకి ఐసీఎంఆర్ అనుమతిచ్చింది. అందువల్ల కిట్ రేటు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ షరతు కారణంగా మన రేటు కూడా తగ్గబోతోంది. ఇందుకు ఆ కంపెనీ అంగీకరించింది.
► వీటిని పరిశీలిస్తే.. అత్యవసర సమయంలో అత్యంత పారదర్శకంగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఆదా చేసినట్లు స్పష్టమవుతోంది.
పుష్కర ఘాట్ల సాక్షిగా వసూళ్లు
కృష్ణా పుష్కరాలు 2016 ఆగస్టు 12 నుంచి ప్రారంభమవుతాయని 2014 ఆగస్టులోనే ముహూర్తం నిర్ణయించారు. అంటే.. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కృష్ణ పుష్కరాల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. పుష్కర ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు రెండేళ్ల సమయం ఉంది. కానీ.. రూ.234 కోట్లతో పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను తమకు కావాల్సిన కాంట్రాక్టు సంస్థలైన ఎల్ అండ్ టీ, సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన అప్పటి ప్రభుత్వ పెద్ద కమీషన్లు వసూలు చేసుకున్నారు.
పోలవరంలో కమీషన్ల వరద
పోలవరం ప్రాజెక్టు పనుల్లో పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. హెడ్ వర్క్స్‌లో రూ.3,489.94 కోట్లు, ఎడమ కాలువలో రూ.2,850 కోట్లు, కుడి కాలువలో రూ.1,645 కోట్లు.. వెరసి మొత్తం రూ.7,984.93 కోట్ల విలువైన పనులను అప్పటి ప్రభుత్వ పెద్ద నామినేషన్ పద్దతిలో అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఈ విషయమై ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఎత్తిచూపుతూ.. పోలవరాన్ని చంద్రబాబు కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని విమర్శించడం టీడీపీ సర్కార్ అక్రమాలకు పరాకాష్టగా చెప్పవచ్చు.
నీరు–చెట్టు.. అవి కనిపిస్తే ఒట్టు
నీరు–చెట్టు పథకం కింద చేపట్టే పనుల్లో రూ.పది లక్షల అంచనా వ్యయం లోపు ఉండే పనులను.. ‘జన్మభూమి కమిటీ’ల ముసుగులో టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులు బాటు కల్పిస్తూ టీడీపీ సర్కార్ 2015లో ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని అడ్డం పెట్టుకుని 2015–16 నుంచి 2019 మే 28 వరకు రూ.18,060.70 కోట్లను నీరు–చెట్టు కింద ఖర్చు చేశారు. ఈ పనులన్నీ అప్పటి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సన్నిహితులైన టీడీపీ నేతలే చేశారు. గతంలో చేసిన పనులనే తాజాగా చేసినట్లు చూపడం.. ఉపాధి హామీ కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో తూతూ మంత్రంగా చేయడం.. పనులు చేయకుండానే చేసినట్లు చూపడం ద్వారా వేలాది కోట్ల రూపాయాలను కాజేశారు.
Comments
Please login to add a commentAdd a comment