ఓటు దొంగ బాబు సర్కారే ! | TDP Leaders Misleads EC And Registered Fake Votes In AP | Sakshi
Sakshi News home page

ఓటు దొంగ బాబు సర్కారే !

Published Thu, Mar 14 2019 7:51 AM | Last Updated on Thu, Mar 14 2019 12:55 PM

TDP Leaders Misleads EC And Registered Fake Votes In AP - Sakshi

2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,53,74,337 మంది. 2018 నాటికి ఆ సంఖ్య కనీసం ఒక శాతం పెరిగిందనుకున్నా ఓటర్ల సంఖ్య అదనంగా 3.5 లక్షలు పెరగాలి. ఎన్నికల సంఘం మాత్రం 2018 డిసెంబర్‌ నాటికి మన రాష్ట్రంలో 3,49,23,171 మంది ఓటర్లే ఉన్నారని చెబుతోంది. దేశంలోని 19 రాష్ట్రాల్లో 5 నుంచి10 శాతం వరకు ఓటర్లు పెరిగితే మన రాష్ట్రంలో ఏకంగా 4,51,166 మంది ఓటర్లు తగ్గారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రతి ఏటా ఓటర్ల సంఖ్య పెరగడం ఒక శాస్త్రీయ ప్రక్రియ. మరి ఆ సూత్రం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు వర్తించలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాగే మన రాష్ట్రంలోనూ భారీగా దరఖాస్తులు చేసుకుని ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఆ ఓట్లన్నీ ఏమయ్యాయి? ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రంలో ప్రతీ ఏడాది ఓటర్ల సంఖ్య పెరగలేదంటే ఎక్కడో పెద్ద పొరపాటు జరిగిందనేది స్పష్టం. పైగా ఓట్లు తగ్గాయంటే  తెరవెనుక భారీ కుట్ర చేశారని ఇట్టే తెలిసిపోతుంది.

సాక్షి, అమరావతి : ఈసీ లెక్కల సాక్షిగా రాష్ట్రంలో ఓటు దొంగలెవరో తెలిసిపోయింది. చంద్రబాబు సర్కారే ఈ ఐదేళ్లలో జనాల ఓట్లకు చిల్లు పెట్టిందని తేలిపోయింది. ఎంతో రహస్యంగా సాగించిన గుట్టు రట్టయ్యింది. ప్రజాస్వామ్యంలో ఎంతో పవిత్రంగా భావించే లక్షలమంది ఓటు హక్కును  ఈ ప్రభుత్వం హరించింది. అయితే తమకేం తెలియదంటూ బొంకుతున్న చంద్రబాబు సర్కారు.. ఓటర్లు తగ్గడంపై ఎందుకు నోరు మెదపడం లేదు? దేశమంతా ఓటర్ల సంఖ్య పెరుగుతుంటే.. అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో తగ్గడంపై చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? ఓ కుండలో నీళ్లు నింపుతుంటే.. మరోవైపున దానికి ఎవరైనా చిల్లు పెడితే ఆ కుండ ఎప్పటికీ నిండదు. ఆ కుండలా రాష్ట్ర ఓటర్ల జాబితాను తయారుచేశారు. ఓటరు చైతన్యంతో ఒక పక్క ఓటు నమోదు చేసుకుంటుంటే.. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఆ జాబితాకు చిల్లు పెట్టారు. ఐదేళ్లపాటు ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులు, తటస్థుల ఓటర్లను పక్కా పన్నాగంతో తొలగిస్తూ వచ్చారు.  

ఈ నాలుగేళ్లలో 18 లక్షల మంది యువ ఓటర్లే  
2015 నాటికి రాష్ట్ర జనాభా 5,12,22,274గా ఉంటే... 2018 డిసెంబర్‌కు అది 5,30,01,971కు చేరింది. దాదాపు 18 లక్షల జనాభా పెరిగారు. 2014 నుంచి 2018 మధ్య రాష్ట్రంలో కొత్తగా 18 ఏళ్లు నిండినవారు దాదాపు 18 లక్షల మంది ఉన్నారని ఎన్నికల సంఘమే ప్రకటించింది. కొత్తగా 18 ఏళ్లు నిండినవారితోపాటు, గతంలో ఓటు హక్కులేని వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగాలి. 2009 – 2014 మధ్య ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోని సీమాంధ్ర జిల్లాల్లో కొత్తగా దాదాపు 30 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 2014 తరువాత అందుకు విరుద్ధంగా ఓటర్లు తగ్గిపోవడం వెనుక భారీ కుట్ర ఉందని సులువుగా తెలిసిపోతోంది.  

ఎంత పెద్ద కుట్రో! 
ప్రతీ ఏడాది ఓటర్ల సంఖ్య పెరగడం అత్యంత సహజం. అందుకు భిన్నంగా ఏపీలో ఓటర్ల జాబితాకు చిల్లు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా వ్యూహం అనుసరించింది. 2014లో అధికారం చేపట్టిన తరువాత ద్విముఖ వ్యూహంతో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, తటస్థుల ఓట్లను భారీగా తొలగించారు. అదే సమయంలో టీడీపీ మద్దతుదారుల పేర్లతో దొంగ ఓట్లను దొడ్డిదారిన జాబితాలో చేర్పించారు. ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ పన్నాగాన్ని అమలు చేశారు. ప్రజాసాధికారిక సర్వే నిర్వహించి ప్రజల పూర్తి వివరాల్ని ప్రభుత్వం సేకరించింది. ఆ సమాచారాన్ని  ఆర్టీజీఎస్‌కు అనుసంధానించింది. అక్కడ నుంచి వివరాలు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు చేరాయి. అనంతరం ఆ సంస్థ  ప్రత్యేక యాప్‌ను రూపొందించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దాంట్లో అప్‌లోడ్‌ చేసింది. అనంతరం సర్వే పేరిట ప్రజల అభిప్రాయాలు సేకరించారు.  


నకిలీ సర్వే బృందాలతో కుట్ర వెలుగులోకి 
సర్వేలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసంతృప్తి, అగ్రహం వ్యక్తం చేసినవారు, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, తటస్థుల్ని గుర్తించారు. అనంతరం వారి ఆధార్‌ కార్డు, ఇతర వివరాల ఆధారంగా వారి ఓట్లను గుట్టు చప్పుడు కాకుండా తొలగించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లపాటు చాపకింద నీరులా జరిగిపోయింది. కొన్ని నెలల క్రితం గ్రామాల్లోకి వచ్చిన నకిలీ సర్వే బృందాల తీరు సందేహాస్పదంగా ఉండటంతో అసలు బండారం బట్టబయలైంది. అప్పటికే ప్రభుత్వం ఓటర్లను అక్రమంగా తొలగించింది. దాదాపు 50 లక్షల వరకు ఓట్లను తొలగించి ఉంటారని ఓ అధికారి చెప్పడం గమనార్హం.  

దొంగ ఓట్లు చేర్పించేందుకు పలు ప్రయోగాలు 
ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా ఓట్లు తొలగిస్తే గుట్టు బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఓ వైపు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూనే మరోవైపు టీడీపీ మద్దతుదారుల పేర్లతో దొంగ ఓట్లు భారీగా చేర్పించారు.  

వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ 
రాష్ట్ర ప్రభుత్వ అండతో భారీగా ఓట్లను తొలగించడంపై వైఎస్సార్‌సీపీ ఈసీకి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసింది. దాంతో ఎన్నికల సంఘం స్పందించి చర్యలకు ఉపక్రమించింది.  హైదరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగడంతో టీడీపీ ప్రభుత్వ బాగోతం బట్టబయలైంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. అక్రమ ఓటర్ల తొలగింపునకు అడ్డుకట్ట వేసింది. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. దాంతో 2019 ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతానికి 1.72 లక్షల ఓట్లు పెరిగాయి.  
 
దొంగ ఓట్లపై అనుమానం రాకుండా ఈసీని బోల్తా కొట్టించేలా రకరకాల ప్రయోగాలు..
1. సానుభూతిపరుల పేర్లు, ఇంటి పేర్లను మార్చారు   
2. చిరునామాలు మార్పుతో కొన్ని దరఖాస్తులు 
3. మహిళల ఓట్లయితే తండ్రి పేరు ఓసారి, భర్తపేరు మరోసారి దరఖాస్తుల్లో చూపించారు. సమీపంలో ఉండే వేర్వేరు గ్రామాల్లో ఓటు కోసం దరఖాస్తు చేశారు 
4. దొంగ చిరునామాలతో మరిన్ని దరఖాస్తులిచ్చారు. ఇలా భారీగా దొంగ ఓట్లను చేర్చించారు. 2014 నుంచి 2018 చివరి వరకు చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా ఈ అక్రమాలకు పాల్పడింది.  
 
ప్రముఖుల మాట
టీడీపీ నేతలకు ఓటమి భయం 
‘ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా తుపాన్‌ గాలి వీస్తోంది. ఎవర్నీ కాపాడాల్సిన అవసరం మాకు లేదు. బీజేపీపై నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది.’ 
–ఎంపీ, జీవీఎల్‌ 

చట్టం అందరికీ వర్తించాలి 
‘చట్టం ప్రతి ఒక్కరికీ వర్తించాలి. కేవలం ఎంపిక చేసుకున్న కొందరికే కాదు. అది వాద్రా అయినా మోదీ అయినా అందరినీ విచారించాల్సిందే’ 
– చెన్నైలో విద్యార్థుల సమావేశంలో రాహుల్‌ గాంధీ 

.. అందుకే ఎన్డీయే నుంచి బయటకొచ్చారు 
‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయలేదన్న కారణంతోనే చంద్రబాబు నాయుడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చారు.’ 
– వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement