పోలీసులతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వాగ్వాదం
సాక్షి, విజయవాడ: మూడు రాజధానులు వద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం విజయవాడలో హంగామా సృష్టించారు. వీరి హడావుడి వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ వేదిక కళ్యాణమండపంలో చేపట్టిన 24 గంటల దీక్షను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. అనంతరం చినకాకానిలో చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధనంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడులతో కలిసి వారు బయలుదేరారు. బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నారా లోకేష్, కొల్లు రవీంద్ర, రామానాయుడులు ఓవర్ యాక్షన్ చేశారు. దీంతో పోలీసులు లోకేష్‌ను తొట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధా పోలీసుస్టేషన్ వద్దకొచ్చి ధర్నా చేశారు.
పోలీసులను తిట్టిపోసిన బొండా ఉమా
చినకాకాని వద్ద హంగామా సృష్టించడానికి బయలుదేరిన ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా బొండా ఉమా ఓ ఎస్‌ఐతో దురుసుగా వ్యవహరించారు. ‘నోరు మూసుకో.. ఖాకీ చొక్కాను ఎలా విప్పదీయించాలో నాకు తెలుసు’ అంటూ నోరు పారేసుకున్నారు. నిరసన తెలిపేందుకు మాత్రమే అనుమతి తీసుకుని మాజీ మంత్రి దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై హైడ్రామా సృష్టించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన 24 గంటల దీక్షకు స్పందన కరువైంది.
Comments
Please login to add a commentAdd a comment