
సాక్షి, విజయవాడ: రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని శ్రీనివాస్(నాని) టీడీపీలో ఏకాకిగా మారుతున్నారు. ఇటీవల అధిష్టానంపై తీవ్ర ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండటం.. పార్టీలోని నాయకులను బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుండటంపై పార్టీలో ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ అండగా ఉన్న కొందరు నేతలు సైతం ఆయనకు దూరం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేడర్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ అభివృద్ధి కంటే ఆధిపత్య పోరుకే ఎంపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి.
గెలిచినప్పటి నుంచి..
ఎన్నికల్లో గెలవగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని, విజయవాడ వచ్చిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌ను ఎంపీ కేశినేని ప్రత్యేకంగా కలవడం ఆ పార్టీలో చర్చనీయాశంగా మారింది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లోక్‌సభలో పార్టీ విప్ బాధ్యతలు అప్పగిస్తే తనకు అవసరం లేదంటూ బహిరంగంగానే తృణీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, 35(ఏ)లను రద్దు చేస్తే దాన్ని లోక్‌సభలోనూ, బయట టీడీపీ సమర్థించింది. అయితే ఎంపీ కేశినేనినాని మాత్రం బయటకొచ్చి వ్యతిరేకించడం కేడర్‌ను గందరగోళంలో పడేసింది.
అర్బన్ నేతలు దూరం..దూరం..
ఎంపీ కేశినేని నానికి, అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్‌లో యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు ట్వీట్‌ల రూపంలో తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఒకరు దొంగ బస్సులు తిప్పారంటే.. మరొకరు సైకిల్ బెల్స్, చెప్పులు దొంగిలించుకున్నారని విమర్శించుకున్నారు. దీంతో బుద్ధావెంకన్న కేశినేని నానికి దూరమయ్యారు. గతంలో కేశినేని భవన్‌లో కీలక పాత్ర పోషించిన, అర్బన్ కార్యదర్శి పట్టాభి కూడా ఎంపీ కేశినేనికి దూరం జరిగారు. తనకు పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పి కేశినేనిని వీడారు. కేశినేని భవన్‌లో పట్టాభికి ప్రాధాన్యం ఏమాత్రం లేదని అంటున్నారు. ఇక కేశినేని భవన్‌కు వెళ్లే అర్బన్, జిల్లా నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమా నిఘా పెట్టినట్లు సమాచారం. అటువైపు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లా సమావేశాలకు ఎంపీ గైర్హాజరు..
గత ఐదేళ్లు టీడీపీ జిల్లా పార్టీ సమావేశాలు నిర్వహిస్తే ఎంపీ కేశినేని నాని తప్పని సరిగా హాజరయ్యేవారు. అయితే రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు హాజరయ్యే సమావేశాలకు మాత్రం హాజరై కొద్దిసేపు ఉండి వెళ్లిపోతున్నారు.
సొంత గ్రూపు..
పార్టీలో కూడా తన సొంత గ్రూపును తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. అర్బన్ పార్టీలోనూ తనకు అనుకూలంగా ఉండే మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ వంటి వారినే తన కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు.
వివాదాల పయనం..
కేశినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వామపక్షాలపై పలు ఆరోపణలు చేయడంతో ఆ నాయకులు కేశినేని ట్రావెల్స్ సిబ్బందికి జీతాలు ఎగ్గొట్టడంపై నిలదీశారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పీవీపీ తన ట్వీట్స్‌లో ఎంపీ నానిని కడిగేస్తున్నారు. ఎంపీ నాని ప్రజాసమస్యలపై కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలకే పరిమితమవుతున్నారని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. రోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ ట్విట్టర్ పులిగా మారారని, ఆయన వ్యవహార శైలితో పార్టీ ఇరకాటంలో పడుతోందని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.