
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. దీంతో రాజ్యసభ వెబ్‌సైట్‌లో బీజేపీ సభ్యుల జాబితాలో టీడీపీ ఎంపీల పేర్లు అధికారికంగా నమోదు అయ్యాయి. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యులుగా తోట సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ పేర్లను మాత్రమే చూపుతోంది. మరోవైపు విలీనం చెల్లదంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. కాగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేస్తూ తీర్మానించిన లేఖను ఆ పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ నిన్న వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లి అందచేసిన విషయం తెలిసిందే.
అనంతరం ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. అయితే, కాలికి గాయం కావడంతో గరికపాటి మోహన్‌రావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment