సాక్షి, ఢిల్లీ / అమరావతి: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ మెజార్టీ రాజ్యసభ సభ్యులు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా వారితో జట్టు కట్టనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీడీపీ ఎంపీలు కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో టచ్‌లో ఉన్నారు. పార్టీని వీడి వీరంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో మట్టి కరిచిన టీడీపీపై చంద్రబాబు దాదాపుగా పట్టుకోల్పోయినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదనే నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ ఎంపీలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ కేంద్రంగా ఇందుకు సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈమేరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ త్వరలో చీలిపోనుందని తెలుస్తోంది. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో చర్చలు జరుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వారితో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి ఒక్క రవీంద్రకుమార్ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని మూకుమ్మడిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దారి చూపించిన ఎంపీ కేశినేని
టీడీపీలో చీలికకు విజయవాడ ఎంపీ కేశినేని నాని దారి చూపించారని తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చెందిన వెంటనే కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అప్పటికే ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఎక్కడా తగ్గకుండా చంద్రబాబుపై విమర్శల జోరు పెంచారు. తద్వారా పార్టీలోని మెజార్టీ నేతల అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులపై ఆయన సూటిగా చేసిన విమర్శలు సరైనవేనని టీడీపీ శ్రేణులు సైతం అభిప్రాయపడ్డాయి. ఎంపీ కేశినేని నాని విమర్శలను టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. అంటే పక్కా ప్రణాళికతోనే టీడీపీ మెజార్టీ ఎంపీలు చంద్రబాబుపై తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారని తెలుస్తోంది. ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులతోపాటు కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
మనదారి మనం చూసుకుందాం..
ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీలో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ ఎంపీలు కుండబద్ధలు కొడుతున్నారు. విచ్చలవిడి అవినీతి, ఒంటెత్తు పోకడలతో ఐదేళ్లు నిరంకుశంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలను చెప్పాలని తామెంత ప్రయత్నించినప్పటికీ ఆయన వినిపించుకోలేదని ఎంపీలు అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు. కేవలం తన కుమారుడు లోకేశ్‌ను భావి నేతగా తీర్చిదిద్దాలన్న స్వార్థంతో పార్టీ పుట్టి ముంచారని ధ్వజమెత్తుతున్నారు. తిరుగులేని మాస్ లీడర్‌గా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే వ్యూహలే లేకుండా పోయాయని పేర్కొంటున్నారు.
ఇక కోలుకోవడం అసాధ్యమే
వైఎస్ జగన్ అంతటి ప్రజాదరణ ఉన్న నేత టీడీపీలో లేనందున కనీసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుందామన్నా చంద్రబాబు వినిపించుకోలేదని ఎంపీలు విమర్శిస్తున్నారు. బీజేపీతో తెగదెంపులు, పవన్ కల్యాణ్‌తో లోపాయికారీ పొత్తు రాజకీయంగా టీడీపీని దెబ్బతీశాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇక కోలుకోవడం అసాధ్యమని ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. చంద్రబాబుకు వయోభారం, లోకేశ్ అసమర్థత టీడీపీకి ప్రతికూల అంశాలని విశ్లేషిస్తున్నారు. టీడీపీలో ఇంకా కొనసాగడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమని మెజార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నందున ఆ పార్టీలో చేరడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీలో చేరిక అంశంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు ఒకరిని ‘సాక్షి’ సంప్రదించగా ఆయన స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం.
బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం
రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలన్న వ్యూహంతో ఉన్న బీజేపీ.. టీడీపీ ఎంపీలను చేర్చుకోడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏకు 102 మంది సభ్యులున్నారు. వీరిలో బీజేపీ సభ్యులు 71 మంది మాత్రమే. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానాలకు త్వరలో నిర్వహించే ఎన్నికలతో రాజ్యసభలో బీజేపీకి కొత్తగా మరో నలుగురు సభ్యులు చేరనున్నారు. దీంతో బీజేపీ బలం 75కు, ఎన్‌డీయే బలం 106కు పెరుగుతుంది. కానీ కీలక బిల్లుల ఆమోదానికి ఈ మెజార్టీ సరిపోదు. ‘ఒక దేశం... ఒకే ఎన్నికలు’ ‘ట్రిపుల్ తలాక్ రద్దు’ తదితర బిల్లులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆమోదం పొందేలా చూడాలన్నది బీజేపీ వ్యూహం.
పార్టీ మూల సిద్ధాంతాలకు సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి తదితర బిల్లులను కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నది బీజేపీ యోచన. ఈ నేపథ్యంలో కీలక బిల్లులు ఆమోదం పొందేలా చూసేందుకు 2020 నాటికి రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలని బీజేపీ నిర్ణయించింది. అందుకోసం అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు తమతో టచ్‌లోకి రావడంతో వారితో చర్చించే బాధ్యతను రాం మాధవ్, కిషన్‌రెడ్డిలకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరితో టీడీపీ ఎంపీల చర్చలు దాదాపు సానుకూలంగా ముగిసినట్లు సమాచారం. దీనిపై బీజేపీ కీలక నేత ఒకరిని ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఈ సమావేశాల్లోనే రాజ్యసభలో తమ బలం పెంచుకునేలా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తుండగా, టీడీపీని వీడేందుకు ఆ పార్టీ ఎంపీలు సమాయత్తం కావడం రాజకీయాలను రక్తి కట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment