టీడీపీ హత్యా రాజకీయం | TDP Murder Politics in Kuppam Constituency Chittoor | Sakshi
Sakshi News home page

టీడీపీ హత్యా రాజకీయం

Published Sat, Apr 13 2019 8:27 AM | Last Updated on Sat, Apr 13 2019 8:27 AM

TDP Murder Politics in Kuppam Constituency Chittoor - Sakshi

కుప్పం పరిధిలోని 170వ పోలింగ్‌బూత్‌లో తెరుచుకున్న ఈవీఎం

ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యా రాజకీయాలకు దిగారని స్పష్టమవుతోంది. ఏ బూత్‌లో చూసినా ఓటర్లు బారులు తీరి ఉండడంతో ఏం జరుగుతుందో అని ఆందోళనపడ్డారు. ఎక్కడికక్కడ దాడులు, దౌర్జన్యాలకు దిగారు. పోలింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు హత్యా రాజకీయాలకు పాల్పడ్డారు. కొన్నిచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కూడా పోలింగ్‌ బూత్‌ల్లోకి రాకుండా అడ్డుకున్నారు. చివరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనూ బరితెగించారు. అర్ధరాత్రి ఈవీఎంలను ధ్వంసం చేశారు. వాటి స్థానంలో కొత్తవాటిని ఉంచే ప్రయత్నం చేశారు.

సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో బుద్దిచెప్పేందుకు జనం  పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన విషయం తెలిసిందే.  ఓటర్లను చూసిన టీడీపీ నేతలు గుండెల్లో గుబులు పుట్టింది. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దశాబ్దాల కాలంగా కుప్పం వాసులను నమ్మించి మోసం చేస్తూ వస్తున్న తన నిజస్వరూపాన్ని జనం అర్థం చేసుకున్నారని చంద్రబాబు

కుప్పంలోనూ గుబులే!
గ్రహించినట్టున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారని పోలింగ్‌ తీరును బట్టి పసిగట్టారు. దీంతో ఆయనకు కుప్పం గెలుపుపై కూడా గుబులు పట్టుకున్నట్టుంది. తమ్ముళ్లు రంగంలోకి దిగారు. అడ్డదారులు తొక్కైనా తమ అధినేతను గట్టెక్కించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కుప్పం పరిధిలోని 170, 173, 174, 175 పోలింగ్‌ బూత్‌లలోని ఈవీఎంలను ద్వంసం చేసి వాటి స్థానంలో కొత్తవాటిని ఉంచాలని నిర్ణయించారు. ఓటింగ్‌ పూర్తయ్యాక అర్ధరాత్రి దాటాక ఆ బూత్‌లలోకి ప్రవేశించారు. 170 బూత్‌లోని వీవీప్యాండ్‌ను పగులగొట్టారు. మరో మూడు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు తెలిసింది. అయితే ఆ విషయాలను బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలింగ్‌ అధికారులందరినీ వెలుపలకు పంపేసి తమ పని కానిచ్చేశారని ప్రచారం జరుగుతోంది. ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లను పగులగొట్టిన విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కొందరు అధికారులను మేనేజ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్‌ సోదరుడు సతీష్‌ దాడిచేశారు. దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే.. కుప్పంలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కు కుట్రలు బయటపడ్డాయి. బీజేపీ అభ్యర్థి ఎక్కడా తన ఎజెంట్లను నియమించకుండా చంద్రబాబుకు ఓట్లు వేసేలా కృషి చేశారు.

హత్యా రాజకీయాలు
తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి శంకర్‌యాదవ్‌ సొంత ఊరు పీటీఎం మండలం టి.సదుంలోనే తనకు వ్యతిరేకంగా ఓట్లు పోలవుతున్నాయని గ్రహించి నాయకులు, కార్యకర్తలను ఉసిగొల్పారు. రెచ్చిపోయిని టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆర్‌పి వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు. పూతలపట్టులో ఈసారైనా పట్టు నిలుపుకోకపోతే పరువుపోతుందని భావించిన టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ అనుకూల ఓటర్లను బూత్‌ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. పొలకల కట్టకిందపల్లి పరిధిలోని ఉప్పరపల్లి పోలింగ్‌ బూత్‌లో ఎస్సీ ఓటర్లను ఓటు వెయ్యనివ్వకుండా అగ్రకులస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఏకంగా అభ్యర్థిపైనే దాడిచేసి హత్యాయత్నం చేశారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను కొట్టారు. అంతటితో ఆగని పచ్చ నేతలు ఎంఎస్‌ బాబు వాహనాన్ని ధ్వంసంచేశారు. మీడియా కెమెరా మెన్‌ రమణపై దాడిచేసి అతని వద్ద ఉన్న కెమెరాను పగులగొట్టారు. బందార్లపల్లెలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. 

బాబు సొంత నియోజకవర్గంలో రౌడీ తమ్ముళ్లు
సీఎం చంద్రబాబు జన్మించిన నియోజకవర్గం చంద్రగిరిలో ఈసారి ఎలాగైనా పరువు కాపాడుకోవాలని ఏరి కోరి పులివర్తి నానిని అభ్యర్థిగా రంగంలోకి దించారు. సీఎం, మంత్రులు అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. టీడీపీ శ్రేణులు ఏం చేస్తున్నా పట్టించుకోకూడదని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో నియోజక వర్గంలోని రామచంద్రాపురం, తిరుపతి అర్బన్‌ మండలం మంగళం, రూరల్‌ మండలం పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. వైస్సార్‌సీపీకి దళితులంతా ఓట్లు వేస్తారని వారిని పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీ కండ్రిగ, ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, గణేశ్వరపురం, సొరకాయలపాలెంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. చివరకు ఎమ్మెల్యే చెవిరెడ్డిని కూడా గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.

తీవ్రవాదుల్లా ప్రవర్తన
టీడీపీ శ్రేణులు ఆధిపత్యం కోసం తీవ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యంచేస్తూ టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. వార్తల సేకరణ కోసం వెళ్లిన పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులపైనా దాడికి తెగబడ్డారు. పోలింగ్‌ బూత్‌ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరినీ రాకుండా గేట్లు వేసి అడ్డుకుని యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేసుకున్నారని తెలిసింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సొంత మండలం పాకాలలోనైనా పరువు దక్కించుకోవాలని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు భాస్కరనాయుడుపై చేయిచేసుకున్నారు. తుమ్మలగుంటలో పులివర్తి నాని భార్య రంగంలోకి దిగి తమ అనుచరుల ద్వారా మహిళలను లాగి బయటకు పంపేశారు.  

జిల్లా అంతటా కుట్రలు
సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవిబి పురం రాగిగుంట బూత్‌లో ఉన్న వైస్సార్సీపీ ఎజెంట్లను బయటకు వెళ్లాలంటూ టీడీపీ, అధికారులు బెదిరింపులకు దిగారు. తిరుపతి ఎన్‌జీఓ కాలనీలోని బూత్‌ నంబర్‌ 40లో టీడీపీ ఎజెంట్లను లోపల కూర్చోబెట్టి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. తిరుపతి స్కావెంజర్స్‌ కాలనీలో టీడీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. వైస్సార్సీపీకి ఓట్లు పడుతున్నాయని ఓ కార్యకర్త ఈవీఎంని గట్టిగా ఒత్తి మిషన్‌ పనిచెయ్యకుండా చేశారు. పోలింగ్‌ ప్రారంభం అయ్యేసరికి మధ్యాహ్నం 1గంట దాటింది.

ఎన్నికలకు ముందే కుట్రలు
జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సంఘమిత్రలను పోలింగ్‌ బూత్‌ల వద్ద సహాయకులుగా అధికార పార్టీ నాయకులు నియమింపజేశారు. వీరిలో కొందరి ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా పథకం వేశారు. వృద్ధులు, వికలాంగులను పోలింగ్‌ బూత్‌లోకి తీసుకెళ్లి ‘ఇలా ఓటు వేయాలి’ అని చెబుతూ వారే టీడీపీకి అనుకూలంగా ఓటు వేయించి పంపే కార్యక్రమం చేశారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3,500 మందిని ఓపీఓలుగా నియమించారు. వీరిలో కొందరు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుండడంతో స్థానికులు అభ్యం తరం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement