
చిల్లర చేష్టలకు.. చ్‌ప్ పబ్లిసిటీ ట్రిక్కులకు,వివాదాలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌పెట్టింది పేరు. సహజంగానే విశాఖ దక్షిణనియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి పేరుచెప్పగానే ఆయన ఓవర్ యాక్షన్‌లే
గుర్తొస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలోఆయనగారి ‘అతి’ చేష్టలు కూడాశృతిమించి పరాకాష్టకు చేరాయి.ఎంతలా అంటే.. చివరికి టీడీపీశ్రేణులు సైతం ఆయన నిర్వాకాలపైఏహ్యభావం వ్యక్తం చేస్తున్నారు. కనీస
సామాజిక స్పృహ కూడా లేకుండా నిరసనల పేరుతోచేస్తున్న జుగుప్సాకరమైన విన్యాసాలు.. వాసుపల్లిపై అన్ని వర్గాల్లోనూఅసంతృప్తి రగలిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : టీడీపీ విశాఖ అర్బన్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదమే. అధికారం దన్నుతో కన్నూమిన్ను కానకుండా ప్రవర్తించే ఆయన ఇటీవల దళితులను అవమానించడంతో దళిత సంఘాలు ఏకమై కేసు పెట్టాయి. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు కావడం.. అతన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని స్వయంగా పార్టీ శ్రేణులే మంత్రి నారా లోకేష్‌ను కలిసి విన్నవించడం కలకలం రేపింది. ఆ కేసు నేపథ్యంలోనైనా వాసుపల్లి తీరులో మార్పు వస్తుందని అందరూ భావించారు. కానీ ఆయనలో ఇసుమంతైనా మార్పు లేకుండా పబ్లిసిటీ కోసం మరింత దిగజారి వ్యవహరించడమే ఇప్పుడువివాదాస్పదమవుతోంది.
విశాఖను నోడల్ జిల్లాగా తీసుకున్న రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నగరంలోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేపట్టారు. ఆ క్రమంలోనే దక్షిణ నియోజకవర్గంలో కూడా పర్యటించారు. టీడీపీ పాలనలో నయవంచనకు గురైన వివిధ వర్గాల ప్రజలు పాదయాత్రలో ఆయన్ను కలిసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను విన్నవించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ప్రభుత్వతీరును ప్రజాస్వామ్య పద్ధతిలోనే విమర్శించారు. విజయసాయిరెడ్డి వాదనలతో ఏకీభవించని పక్షంలో వాసుపల్లి సహా టీడీపీ నేతలు వివిధ ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు చేపట్టొచ్చు. కానీ వాసుపల్లి కనీస సామాజిక స్పృహ లేకుండా చేసిన నిరసనలు ఇప్పుడు వివాదాస్పదవుతున్నాయి. విజయసాయిరెడ్డి పాదయాత్ర చేసిన రోడ్ల వెంట పసుపు నీళ్ళు చల్లడమే దారుణమైతే.. ఆ తర్వాత బూడిద గుమ్మడికాయలతో దిష్టి తీసి ర్యాలీగా శ్మశానవాటిక వద్దకు వెళ్ళి అక్కడ గుమ్మడికాయలను నేలకేసి కొట్టడం.. వంటి దిగజారుడు చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇలాంటి పద్ధతుల్లో నిరసనలా.. అంటూ స్వయంగా టీడీపీ నేతలే అంతర్గతంగా వాసుపల్లిపై ధ్వజమెత్తుతున్నారు. వాసుపల్లి వెర్రి పరాకాష్టకు చేరిందంటూ అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం పెల్లుబుకుతోంది.
వాసుపల్లికి పిచ్చెక్కింది:కోలా గురువులు
విజయసాయిరెడ్డి పాదయాత్రతో ఎమ్మెల్యే వాసుపల్లికి మైండ్‌బ్లాక్ అయి పిచ్చిపట్టిందని వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు ధ్వజమెత్తారు. మూఢ నమ్మకాలు, బాణామతి, చిల్లంగి వంటివి వాసుపల్లి ఆయుధాలని ఆరోపించారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఎప్పుడు కార్యక్రమాలు చేపట్టినా భూతవైద్యుడి మాదిరిగా శుద్ధి పేరిట క్షుద్ర కార్యక్రమాలు చేస్తున్నారని కోలా విమర్శించారు. జన్మభూమి కమిటీల్లో రౌడీలు, గూండాలను సభ్యులుగా చేర్పించి పేదల పెన్షన్లలో కమీషన్లు కొట్టేసే వాసుపల్లికి విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. హిజ్రాలను కూడా మోసం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసి బతికే వాసుపల్లికి విజయసాయిరెడ్డి పేరు కూడా పలికే అర్హత లేదని ధ్వజమెత్తారు.
వాసుపల్లిని అరెస్టు చేయాలి:టి.శ్రీనివాస్
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై కేసు పెట్టినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దారుణమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు టి.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ వార్డు అధ్యక్షుడి మార్పు విషయంలో దళితులను తూలనాడిన కేసులో ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వాసుపల్లి బెదిరింపులతో పోలీసులు తమపై కౌంటర్ కేసులు పెట్టినా విచారణలో అవన్నీ అసత్యాలేనని రుజువయ్యాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. అధికారం అండతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న వాసుపల్లిని వెంటనే కట్టడి చేయకుంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment