సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు లాంటి కేసులకు భయపడి ఏపీ ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన బాబు బ్యాచ్.. ఇప్పుడు కేంద్రంతో యుద్ధం చేస్తామని బీరాలుపోతున్నది. ‘రాజీనామాలు, బహిష్కరణలపై ప్రకటనలు వద్ద’ని సీఎం చంద్రబాబు సూచించి 24 గంటలైనా గడవకముందే తెలుగుదేశం ఎంపీ టీజీ వెంకటేశ్ పూర్తి విరుద్ధంగా స్పందించారు. బీజేపీ పొగరు దించుతామని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తారని చెప్పారు. శుక్రవారం ఇటు అమరావతిలో టీడీపీ సమన్వయ సమావేశం జరుగుతున్న సమయంలోనే టీజీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబునే బీజేపీ పట్టించుకోవడంలేదు. ఒంటరిగా మెజారిటీ సీట్లు ఉన్నాయన్న పొగరుతోనే బీజేపీ తన మిత్రులను లెక్కచేయడంలేదు. ఏపీలో టీడీపీది, మహారాష్ట్రలో శివసేనది అలాంటి పరిస్థితే. ఇప్పుడు బీజేపీ పొగరు దించాల్సిన అవసరం ఉంది. బాబును ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యొద్దు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమికి చంద్రబాబును మించిన నాయకులు లేరు. ప్రేమగా పనులు చేయించుకుందామన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ ఊరుకున్నాం. ఏపీకి ప్రత్యేకహోదా బదులు ప్యాకేజీ ఇస్తానని కేంద్రం అంటే ఒప్పుకున్నాం. ఇప్పుడా ప్యాకేజీ కూడా లేదు. కాబట్టి మేం మళ్లీ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తాం.
కేంద్ర ప్రభుత్వంపై యుద్ధంలో మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేశాం. మొదటిగా కేబినెట్‌లో ఉన్న టీడీపీ మంత్రుల రాజీనామా, రెండో దశలో ఎంపీల రాజీనామాల గురించి ఆలోచిస్తున్నాం. చివరిదైన మూడో అడుగులో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటాం. అయినా, బీజేపీకి గతంలో ఉన్నంత బలంలేదిప్పుడు. ఇటీవలి ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఎదురుదెబ్బలు తిన్న విషయం తెలిసిందే. ఆదివారం జరుగనున్న టీడీపీ కీలక సమావేశంలో ఈ మేరకు వార్ డిక్లరేషన్ ఉంటుంది’’ అని టీజీ వెంకటేశ్ చెప్పారు. ఎంపీ వ్యాఖ్యలపై చంద్రబాబుగానీ, ఇతర నాయకులు స్పందించాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment