తేజస్వీ యాదవ్ (ఫైల్ ఫోటో)
పట్నా : మహాకూటమి కారణంగానే నితీష్ కుమార్ సీఎం అయ్యారని, ప్రజలను మోసం చేసి బీజేపీతో కలిపి అధికారాన్ని అనుభవిస్తున్నారని ఆర్జేడీ నేత, బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. ఆయన రాష్ట్రానికి ఛీప్ మినిస్టర్ కాదని.. ఛీటింగ్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. శనివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేది ప్రతిపక్ష పార్టీలు కాదని.. ప్రజలే మోదీని ఒడిస్తారని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోరు బీజేపీకి ప్రతిపక్ష పార్టీల మధ్య కాదని.. బీజేపీకి దేశ ప్రజల మధ్య పోరు జరుగనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల పేరుతో దేశ యువతను మోదీ ఛీట్ చేశారని.. ఆయనను తిరిగి ఎన్నుకునేందుకు ప్రజలతో సహా, యువత కూడా సిద్దంగా లేదని అన్నారు.
మోదీకి తాము వ్యతిరేకం కాదని.. మోదీ అనుసరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ విధానాలకే తాము పూర్తిగా వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. దేశాన్ని విభజించి, కుల, మతాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు నిజంగా దేశ భక్తి ఉంటే నాగపూర్‌లోని ఆ సంస్థ కార్యాలయంపై జాతీయ జెండాను ఎందుకు ఎగరవేయ్యరని తేజస్వీ ప్రశ్నించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తే రాహుల్ గాంధీయే ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని.. దానికి ఆయన సిద్దంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాని నేపథ్యంలో ఎన్నికల తరువాతనే ఉమ్మడి ఉభ్యర్ధిని ఎన్నుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment