అన్నన్నా.. అచ్చెన్నా..ఈ బెదిరింపులేందన్నా..! | Tekkali TDP MLA Candidate Atchannaidu Threatened Anganwadi Staff For Electing Him | Sakshi
Sakshi News home page

అన్నన్నా.. అచ్చెన్నా..ఈ బెదిరింపులేందన్నా..!

Published Fri, Mar 15 2019 9:31 AM | Last Updated on Wed, Apr 3 2019 8:48 PM

Tekkali TDP MLA Candidate Atchannaidu Threatened Anganwadi Staff For Electing Him - Sakshi

మంత్రి అచ్చెన్నాయుడు

‘నేను మాట్లాడినపుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి.. కాదని వేరేదేమైనా పనిచేస్తే నీకు నెక్ట్స్‌ బర్త్‌డే ఉండదు...’ –అది పాపులర్‌ సినిమా డైలాగ్‌

‘రానున్న ఎన్నికల్లో నా గెలుపు కోసమే మీరు పనిచేయాలి... గ్రామాల్లో నా కోసం ప్రచారం చేయాలి... నా నామినేషన్‌కు పెద్ద ఎత్తున ప్రజలను తరలించే బాధ్యత మీదే... అలా కాదని ఎదురు తిరిగితే మీ ఉద్యోగాలు ఊడిపోతాయ్‌’ –ఇది ఓటమి భయంతో వణికిపోతున్న మంత్రి గారి మేకపోతు గాంభీర్యం 

సాక్షి, టెక్కలి/కోటబొమ్మాళి: రెండు రోజుల క్రితం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా, ఉపాధి, అంగన్వాడీ సిబ్బందితో రహస్య  సమావేశం నిర్వహించారు. తనకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయని బెదిరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 20న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన టెక్కలిలో నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున డ్వాక్రా, ఉపాధి, అంగన్వాడీ సిబ్బంది తరలిరావాలంటూ మంత్రి హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తన గెలుపు కోసం గ్రామాల్లో తెర వెనుక ప్రచారాలు చేయాలంటూ బెదిరించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా మంత్రి హోదాలో ఉంటూ మరి కొన్ని శాఖలకు చెందిన సిబ్బందితో రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు మంత్రి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి హోదాను ఉపయోగించుకుని తన గెలుపు కోసం అనుకూలమైన మార్గాలను అనుసరిస్తున్నట్లు సమాచారం. డ్వాక్రా, ఉపాధి, అంగన్వాడీ సిబ్బందితో రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారిని బెదిరించే పర్వం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు తన విజయం సునాయాసం అంటున్న అచ్చెన్నాయుడు మరో వైపు ఈ విధమైన బెదిరింపులకు దిగడం గమనార్హం.

ఐదేళ్ల టీడీపీ పాలనలో పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జన్మభూమి కమిటీలు, కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేసిన అరాచకాలతో ఇప్పటికే ప్రజలు విసిగిపోయివున్నారు. ఈసారి ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో.. మంత్రికి ఓటమి భయం పట్టుకుందా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement