
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరికొద్ది గంటల సమయమే ఉండటంతో కేబినెట్‌లో బెర్త్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో ‘హై’ టెన్షన్ నెలకొంది. మంత్రివర్గ విస్తరణలో పలువురి పేర్లు తెరమీదకు వచ్చినా... తుది జాబితా మాత్రం ఇప్పటివరకూ అధికారంగా బయటకు రాలేదు. మరోవైపు ఎనిమిది లేదా తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలకే ప్రగతి భవన్ నుంచి పిలుపురావడంతో వారంతా ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ అధికారులు పలువురికి ఆదివారమే సమాచారం అందించగా, తాజాగా సోమవారం మరికొందరు ప్రగతి భవన్ చేరుకున్నారు. వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు.
మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందంటూ ప్రశాంత్ రెడ్డి (నిజామాబాద్), నిరంజన్ రెడ్డి (మహబూబ్ నగర్), ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), జగదీశ్ రెడ్డి (నల్లగొండ), కొప్పుల ఈశ్వర్ (కరీంనగర్), ఎర్రబెల్లి దయాకర్ రావు (వరంగల్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్), ఈటల రాజేందర్ (కరీంనగర్), అలాగే డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మంత్రివర్గంలో ఉంటారా అనే దానిపై అధికార పార్టీతోపాటు రాజకీయ వర్గాలు, ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఎవరికి వారు మాత్రం తమకు ఛాన్స్ దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. సీఎం కార్యాలయం లేదా సాధారణ పరిపాలనశాఖ నుంచి ఫోన్లు వచ్చాయా అంటూ ఆశావహులు తమ పరిధి మేరకు ఆరా తీస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరం నుంచి కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కనివారికి అంతకు సమానమైన కేబినెట్ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ కూర్పుపై నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment