సాక్షి, హైదరాబాద్: ప్రజలను ఆకర్శించే హామీలతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా 35 అంశాలతో 112 పేజీలతో రూపొందించిన మేనిఫేస్టోలో హామీలను గుమ్మరించింది. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ కుంతియా, సీనియర్ నేత జైరాం రమేష్, పార్టీ ముఖ్య నాయకులు కలసి మేనిఫేస్టోను విడుదల చేశారు. సుపరిపాలనతో మొదలుకుని రైతులు, యువత, వైద్యరంగాల సంక్షేమంతో పాటు పలు కీలకమైన అంశాలను ప్రధానంగా ప్రణాళికలో పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని, ప్రతీ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నిజాం వారసత్వ సంపదగా భావించే ఉస్మానియా ఆసపత్రిని కాపాడుకుంటామని పేర్కొంది.
పీపుల్స్ మేనిఫెస్టో ఇది
ప్రజల ఆశలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో తయారు చేశామని, ఇది కచ్చితంగా పీపుల్స్ మేనిఫెస్టో అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ కుంతియా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పక్కాగా మేనిఫెస్టోను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముందుగా ప్రకటించిన పింఛన్, నిరుద్యోగ భృతికి మరో 16 రూపాయలు పెంచి టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో జోడించడం హాస్యాస్పదమన్నారు.
ప్రతీ ఏడాది ఇంప్రూమెంట్ రిపోర్టు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్‌ఎస్ పాలనలో ప్రవేశ పెట్టినవి మంచి పథకాలైతే కొనసాగిస్తామని లేకుంటే తొలగిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పాలసేకరణకు ఐదు రూపాయల ఇన్సెంటీవ్ అందిస్తామని, సీనియర్ సిటిజెన్‌లకు బస్సు ప్రయాణంలో యాభై శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోపై ప్రతీ ఏడాది ప్రజలకు ఇంప్రూవ్‌మెంట్ రిపోర్టు అందిస్తామన్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహా రాలేకపోతున్నానని తెలపడంతో ఆయన లేకుండానే విడుదల చేశామని ఉత్తమ్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టోలోని అంశాలు
- ఉద్యమకారుల కుటుంబానికి 10లక్షల ఆర్థిక సహాయం, సామాజిక గౌరవం
- మూడు నెలల్లో ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
- ఏక కాలంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ
- పెట్టుబడి సహాయాన్ని కొనసాగించి.. రైతు కూలీలకు వర్తింపచేయటం
- 17 పంటలకు మద్దతు ధర
- నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి
- ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ
- 20 వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ
- ప్రతీ మండలానికి 30 పడకల ఆసుపత్రి
- అర్హులైన పేదల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు
- ఇందిరమ్మ ఇండ్ల బకాయిలు చెల్లింపు ..అదనపు గది కోసం రెండు లక్షలు
- ఎస్సీల్లో మూడు కార్పొరేషన్ లు
- ఎస్టీల భూములకు 1970 భూ చట్టాన్ని పటిష్టంగా అమలు
- ఇమామ్ లకు 6వేల గౌరవేతనం, ట్రెజరీ ద్వారా వక్ఫ్ బోర్డు లకు జ్యూడిషియల్ అధికారాలు
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు
- సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్ విధానం అమలు
- పీఆర్సీ, ఐఆర్‌లను అమలు
- పేదలకు ఉచితంగా ఆరు సిలిండర్లు
Comments
Please login to add a commentAdd a comment