సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరుగా దూసుకుపోతుంది. ఇప్పటికే 83 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్.. మరో 4 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగిన కూటమి ఘోర పరాజయం పాలైంది. కూటమి అభ్యర్థులు 18 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కూటమితో జట్టు కట్టిన తెలంగాణ జన సమితి, సీపీఐ ఖాతా తెరవలేదు. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి.
సీపీఐ...
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల నుంచి పోటి చేసిన సీపీఐ అన్ని చోట్ల ఓటమి పాలయ్యంది. బెల్లంపల్లి నుంచి గుండా మల్లేష్, హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి బానోతు విజయ పోటీ చేశారు. కానీ వీరు ముగ్గురు ఓడిపోయారు. బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, హుస్నాబాద్‌లో వడితెల సతీష్ కుమార్(టీఆర్‌ఎస్), వైరా నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రాములు నాయక్ విజయం సాధించారు.
టీజేఎస్...
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ కన్వీనర్ కోదండరాం ఆధ్యర్యంలో ఏర్పాటైన తెలంగాణ జనసమితి(టీజేఎస్) ఈ ఎన్నికల్లో బొక్కబొర్ల పడింది. ఆరు స్థానాల్లో పోటీ చేసిన టీజేఎస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. మెదక్ నుంచి ఉపేందర్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలిప్ కుమార్, వర్ధన్నపేట నుంచి పగిడిపాటి దేవయ్య, వరంగల్(ఈస్ట్) నుంచి గాదె ఇన్నయ్య, సిద్ధిపేట నుంచి భవాని రెడ్డి పోటీ చేశారు. వీరంతా అధికార టీఆర్‌ఎస్ అభ్యర్ధుల చేతిలో ఓటమి పాలయ్యారు. సిద్ధిపేట నుంచి హరీశ్ రావుపై పోటీ చేసిన భవానీ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment