
సాక్షి, హైదరాబాద్: రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో విడతలో భాగంగా ఈ నెల 10న (శుక్రవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఓటింగ్ సమయం ముగియడానికి 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది. 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, అందులో ఒక్క ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్‌ఎస్ గెలుచుకుంది. జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్–179, కాంగ్రెస్–177, బీజేపీ–148, టీడీపీ–60, సీపీఐ–20, సీపీఎం–19, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రాష్ట్రంలో ఎస్‌ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు–40, ఇండిపెండెంట్ అభ్యర్థులు–162 మంది బరిలో నిలిచారు. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే టీఆర్‌ఎస్–1,848, కాంగ్రెస్–1,698, బీజేపీ–895, టీడీపీ–173, సీపీఐ–87, సీపీఎం–92, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రాష్ట్రంలో ఎస్‌ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు–101, ఇండిపెండెంట్ అభ్యర్థులు–1,249 మంది పోటీలో ఉన్నారు.
‘రెండో విడత’కు సర్వం సిద్ధం
శుక్రవారం జరగనున్న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా ప్రాదేశికవర్గ నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ పత్రాలను విడదీసి పోలింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యకు తగ్గట్టు అవసరమైన మేర బ్యాలెట్‌బాక్సులు సిద్ధం చేసుకోవడంతో పాటు ఎన్నికల సిబ్బందికి డ్యూటీల కేటాయింపు, బందోబస్తు, ఎన్నికల సరంజామాను అందుబాటులో పెట్టుకుంటున్నారు. ఈ నెల 14న జరగనున్న మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో రాజకీయపార్టీలు, ఇండింపెండెంట్‌ల వారీగా పోటీచేసే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయింపుతో ఈ విడతకు సంబంధించి రాజకీయపార్టీలు, అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది. 12వతేదీ సాయంత్రం 5 గంటల లోపు తుది విడత ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు, అభ్యర్థులు ముగించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని 5 జెడ్పీటీసీ, 42ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా జిల్లాలకు రెండు, మూడో విడతల్లో ఎన్నికలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment