
బండా నరేందర్‌రెడ్డి (టీఆర్‌ఎస్), కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి (కాంగ్రెస్)
జిల్లా పరిషత్‌పై తొలిసారి గులాబీ జెండా ఎగురవేయాలన్నది అధికార టీఆర్‌ఎస్ ప్రయత్నం.. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగించి తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలన్న వ్యూహం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ది.. వెరసి నల్లగొండ జెడ్పీ ఎన్నికల రాజకీయం రక్తి కడుతోంది. 1959 నుంచి 2014 వరకు తొమ్మిది పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రెండు టర్మ్‌లు మినహా అన్ని సార్లూ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే జెడ్పీ ఉంది. పాతికేళ్లకు పైగా పోటీ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీల మధ్యే సాగేది. కానీ, ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారాయి.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాల పునర్విభజన అనంతరం అత్యధిక మండలాలు (31) ఉన్న పెద్ద జిల్లాగా నల్లగొండకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కింది. నల్లగొండ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఏ పార్టీకైనా 16 జెడ్పీటీసీ స్థానాలు సొంతం కావాలి. ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు ఈ మెజారిటీ కోసమే పోరాడుతున్నాయి. జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, తుది దశ ఎన్నికలకు (నల్లగొండ రెవిన్యూ డివిజన్) సంబంధించి నామినేషన్ల స్వీకరణ కూడా ముగిసింది. దీంతో ఈసారి జెడ్పీ చైర్మన్ పీఠం కోసం ఆయా పార్టీల్లో ఎవరు పోటీపడుతున్నారో, ఆపార్టీ చైర్మన్ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది.
విచిత్రంగా ఇద్దరూ ఒకే జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిచి జెడ్పీ పీఠం ఎక్కాలని పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అధికారికంగా తమ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కోమటిరెడ్డి మోహన్‌రెడ్డిని ప్రకటించింది. కాగా, టీఆర్‌ఎస్ బండా నరేందర్ రెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించినా.. అధినాయకత్వం అధికారికంగా బహిరంగంగా ప్రకటించలేదు. పార్టీలో సంస్థాగతంగా జిల్లా ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చింది. ఇప్పుడు చూస్తే.. ఇరు పార్టీల చైర్మన్ అభ్యర్థులు ఒకే జెడ్పీటీసీ స్థానానికి పోటీ పడుతున్నారు. అంటే తొలి దశలోనే ఒక అభ్యర్థి ఫిల్టర్ అయిపోతున్నారు. దీంతో ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా.. ఒకవేళ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి జెడ్పీటీసీ సభ్యుడిగా ఓడిపోతే రెండో అభ్యర్థిని వెదుక్కోవాల్సిందే. ఈ కారణంగానే టీఆర్‌ఎస్ ముందు జాగ్రత్తగా.. ప్రత్యామ్నాయంగా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిని మిర్యాలగూడ జెడ్పీటీసీ స్థానంనుంచి బరిలోకి దింపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కీలక స్థానంగా ... నార్కట్‌పల్లి
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలనుంచి జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు బండా నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి నార్కట్‌పల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయడంతో ఆ స్థానం కీలకంగా మారింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి విషయంలో ముందునుంచి ఎలాంటి సస్పెన్స్ లేకున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో మాత్రం కొంత డ్రామా నడిచింది. పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని పెద్దవూర జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయించి, జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ.. అనూహ్యంగా కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సోదరుడైన మోహన్‌రెడ్డి గెలుపు బాధ్యతను సోదరులు ఇద్దరూ భుజానికి ఎత్తుకున్నారు. జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన పదహారు మంది సభ్యులను గెలిపించుకోవడం, వారిని కాపాడుకోవడం వంటి ప్రధాన బాధ్యతలను మోసేందుకు కోమటిరెడ్డి సోదరులు ముదుకు రావడంతో మోహన్‌రెడ్డి పేరును టీ పీసీసీ నాయకత్వం ప్రకటించిందని చెబుతున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లో పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు, జిల్లాకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బండా నరేందర్ రెడ్డిని గెలిపించే బాధ్యతను ఇటు నల్లగొండ, అటు నకిరేకల్ ఎమ్మెల్యేలకు అప్పజెప్పిన నాయకత్వం సీరియస్‌గానే పనిచేస్తోంది. దీంతో నార్కట్‌పల్లి జెడ్పీటీసీ స్థానం ఇప్పుడు ఇరు పార్టీలకు కీలకంగా మారింది.
గులాబీ జెండా ఎగరేయాలని..!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్ ప్రయత్నించింది. కానీ, ఆ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ జెడ్పీని నిలబెట్టుకుంది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు జెడ్పీటీసీ సభ్యులు గోడదూకారు. మరికొన్నాళ్లకు జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ సహా కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో సాంకేతికంగా నల్లగొండ జెడ్పీ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరింది. కానీ, మొన్నటి శాసనసభ ముందస్తు ఎన్నికల ముందు బాలూనాయక్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సారి మాత్రం నేరుగా తామే ఎక్కువ స్థానాలు గెలుచుకుని నల్లగొండ జెడ్పీపై గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్ శ్రమిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment