సాక్షి, న్యూఢిల్లీ : మధురై విమానాశ్రయానికి ముత్తురామలింగ థేవర్‌గా పేరు మార్చాలంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన కొన్ని వందల మంది బుధవారం నాడు విమానాశ్రయం ముందు ఆందోళన చేశారు. వారి పిలుపు మేరకు ఆ రోజున నగరంలోని దాదాపు ఐదు వేల దుకాణాదారులు బంద్ జరిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తమ ఉనికిని చాటు కోవడంతోపాటు, మధురై విమానాశ్రయానికి తమ గురువైన ముత్తురామలింగ థేవర్ పేరును పెట్టాలనే పెండింగ్ డిమాండ్‌ను నెరవేర్చుకోవడానికి ఇదే సమయం అంటూ వారు ఆందోళన చేపట్టారు.
మొత్తం రాష్ట్ర జనాభాలో 8–10 శాతం ఉన్న థేవర్ల సామాజిక వర్గంలో మారవర్లు, కల్లార్లు, అగముడయ్యర్లు అనే మూడు ఉప కులాలు ఉన్నాయి. వీరందరిని రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలుగా గుర్తించింది. మధురై దక్షిణాది జిల్లాలైన శివంగంగాయి, థేని, తిరునెల్వేలిలలో వీరు ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడు ఏఐఏడిఎంకే పార్టీకి సంప్రదాయంగా ఓటు వేస్తున్న వీరు ఈ సారి తమ సామాజిక వర్గానికి చెందిన టీటీవి దినకరణ్ పార్టీకి ఓటు వేస్తామని చెబుతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం దినకరణ్ ‘అమ్మ మక్కాల్ మున్నేట్ర కళగం’ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పిలుపు మేరకు థేవర్లు తాజా ఆందోళన చేపట్టారు. దేశ స్వాతంత్య్రానికి ముందు 1939లో స్వాతంత్య్ర సమర యోధుడు సుభాస్ చంద్రబోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్‌ను ఏర్పాటు చేశారు. దేశ స్వాతంత్య్రానంతరం ఈ పేరుకు ముత్తు రామలింగ థేవర్ విశేష ప్రాచుర్యం కల్పించారు. అప్పటి నుంచి థేవర్లంతా ఈ పేరుతోనే ఓ సంఘంగా చెలామణి అవుతున్నారు. ముత్తురామలింగ చనిపోయాక మూడేళ్ల అనంతరం అంటే, 1971లో ఆయన సమాధి ప్రాంతాన్ని ఆయన స్మారక భవనంగా తీర్చిదిద్దారు. 1980లో ఆయన చిత్ర పటాన్ని రాష్ట్ర అసెంబ్లీలో వేలాడదీశారు. ఆయన జయంతి రోజైన అక్టోబర్ 30వ తేదీని థేవర్ల జయంతిగా జరుపుకుంటారు. 2018, అక్టోబర్ 30వ తేదీన మధురైలో ఉన్న ముత్తురామలింగ థేవర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎడప్పడి కే పళనిస్వామి, డిప్యూటి సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, దినకరన్‌లు సందర్శించి పూలమాలలు అలంకరించారు. మధురై విమానాశ్రయానికి ముత్తురామలింగ థేవర్ పేరు పెట్టాలంటూ థేవర్లు గత పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చుకోవడానికి ఇదే అసలైన సమయమని వారు భావించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడతామని ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు తెలిపారు.
ఈసారి థేవర్ల ఓటు ఎవరికి ?
Published Sat, Feb 23 2019 4:57 PM | Last Updated on Sat, Feb 23 2019 7:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment