మాట్లాడుతున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చిత్రంలో రాజారాం, బిల్లే ఈశ్వరయ్య కేశవనాయక్ భార్య, పిల్లలు
అనంతపురం రూరల్: టీడీపీ నాయకులకు తొత్తులుగా మారి రైతులకు అన్యాయం చేస్తున్న అధికారులను మాత్రమే విమర్శించాననీ, నీతి నిజాయతీతో పనిచేసే అధికారులను ఎప్పటికీ గౌరవిస్తామని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కేశవనాయక్ భార్య, కూతుళ్లతో కలిసి మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత బంధువులు మండలాలకో ఇన్‌చార్జిగా ఉంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్ల తెస్తున్నారన్నారు. ప్రతి పనీ వారి కనుసన్నల్లోనే జరిగేలా అధికారులను వేధిస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నా... పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. నియోజకవర్గంలో అనేక మంది రైతుల భూముల రికార్డులు మార్పులు చేస్తూ దౌర్జన్యంగా భూములు లాకుంటున్నారన్నారు.
వారి ఆగడాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకలపై దాడులు, హత్యలకు తెగబడుతున్నా..పోలీసులు చూస్తే ఊరుకుంటున్నారన్నారు. వేపచర్ల లో రైతు కేశవా నాయక్ భార్య శాంతమ్మకు భూపంపిణీ కింద ఇచ్చిన భూమికి సంబంధించి ఆన్‌లైన్‌లో పేరుమార్చి టీడీపీ నేతలు దౌర్జంగా ఆక్రమించుకున్నారనీ, కేశవానాయక్ అక్కడి తహసీల్దార్, రెవెన్యూ అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. పైగా టీడీపీలో చేరితే నీ భూమి నీకు వస్తుందని ఉచిత సలహా ఇచ్చారన్నారు. అందుకే కేశవనాయక్ జిల్లా కేంద్రంలో జరిగే ‘మీకోసం’కు వచ్చి ఏకంగా జిల్లా కలెక్టర్‌కే తన పరిస్థితిని వివరిస్తూ అర్జీ ఇచ్చారన్నారు. అయితే కేశవనాయక్ ఇచ్చి అర్జీ తిరిగి తహసీల్దార్‌కు పంపారనీ...అందువల్లే ఇక తనకు న్యాయం జరగదన్న బాధతోనే కేశవనాయక్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.
కేశవానాయక్ ఆత్మహత్యకు కారణమైన అధికారులను మాత్రమే విమర్శించానన్నారు. కేశవనాయక్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చి తర్వాత శాంతమ్మ ఆ భూమిలో సాగులో లేదని ఈ భూమికి ఆమెకు ఎటువంటి సంబంధంలేదని ఆత్మకూరు రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. కుటుంబానికి అండగా ఉన్న భర్త పోయి ఉన్న భూమిపోయి బ్యాంకులో అప్పులు మిగిలితే కలిగే బాధ ఏ కుటుంబానికీ రాకుడదన్నారు. భర్త లేకపోతే కలిగే బాధ మంత్రి కి కూడా తెలిసే ఉంటుందన్నారు. కనీసం మహిళ అనే కనికరం లేకుండా మానవత్వం మరచి టీడీపీ నాయకులు ప్రవర్తించడం దుర్మాగమన్నారు. టీడీపీ నాయకలు వారి రాజకీయ లబ్ధి కోసం అధికారులను రెచ్చగొడుతున్నారనీ, దయ చేసి వారు చేస్తున్న కుట్రలను గమనించాలన్నారు. టీడీపీ నాయకులకు రైతులు, పేద ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే కేశవనాయక్ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. అపుడు తాను క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.
వనజాక్షిపై దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
ప్రకాష్‌రెడ్డి అధికారులపై చేసిన వాఖ్యలను ఖండిస్తానని చెప్పిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి..మహిళా తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతలు దాడి చేసినప్పుడు ఎక్కడకు పోయారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయనరేంద్ర, కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బిల్లే ఈశ్వరయ్య ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై దాడులకు పాల్పడుతున్నది ఎవరో ఉద్యోగులందరికీ తెలుసన్నారు.
ఇంత అన్యాయమా
మా భూమి రికార్డులు మార్చి ఆక్రమించుకున్నారని ఆధికారులను వేడుకున్నామనీ.. అయినా న్యాయం జరగపోవడంతోనే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో దిక్కుతోచక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కేశవానాయక్ భార్య శాంతమ్మ కన్నీటిపర్యంతమైంది. ఆసరాగా ఉండాల్సిన తండ్రి లేడనీ...ఉన్న భూమిని అన్యాయంగా ఆక్రమించుకుంటే తమకు దిక్కెవరంటూ కేశవానాయక్ కూతుళ్లు త్రివేణి, భారతి వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment