సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, చిత్రంలో ఎంపీ గోరంట్ల మాధవ్
అనంతపురం సెంట్రల్: ‘‘మీ నాన్న పరిటాల రవి వందల మందిని చంపి హీరో అయ్యాడనుకుంటున్నావ్. దేశంలోనే క్రిమినల్ చరిత్రలో మొదటి స్థానం సంపాదించుకున్నాడు. మీ నాన్న చేసినట్లు నువ్వూ చేస్తానంటే ఊరుకునేది లేదు. ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు మా మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దు’’ అని మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన అనంతపురంలోని తన స్వగృహంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేపడుతున్నామన్నారు. టీడీపీ హయాంలో కందుకూరు గోదాము మూసివేయడం వల్ల 500 కుటుంబాలు రోడ్డుపడ్డాయని, తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో గోదాము తెరిపించామన్నారు. పరిటాల కుటుంబం పాతిక సంవత్సరాలుగా నసనకోట ముత్యాలమ్మ దేవాలయానికి భక్తులు, దాతలు ఇచ్చిన సొమ్మును బొక్కుతూ దేవునికే శఠగోపం పెట్టిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకువచ్చామ్నారు.
నియోజకవర్గంలో 60 వేల జనాభాకు తాగునీరు అందించేందుకు అనుమతులు తీసుకొచ్చామని, ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని ఆహుడా పరిధిలోకి తీసుకొచ్చి 20వేల ఇళ్లను మంజూరు చేయించామన్నారు. పేరూరు డ్యాం, గంగులకుంట, బోగినేపల్లి చెరువులకు నీటిని తీసుకొస్తుస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పది వేల మంది మహిళలకు లబ్ధి కలిగించేందుకు ప్రత్యేకంగా డెయిరీని తీసుకొస్తున్నట్లు వివరించారు. రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాము పనిచేస్తుంటే.. గ్రామాల్లో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే కార్యక్రమాలకు పరిటాల శ్రీరామ్ ప్రయత్నిస్తున్నాడన్నారు. దౌర్జన్య పద్ధతుల్లో ప్రజలను, అధికారులను బెదిరిస్తున్నాడన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేసి ఈడ్చుకెళ్లినట్లు స్వయంగా శ్రీరామ్ ప్రకటించాడన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు టీడీపీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులు దొరకడం లేదని, వంద మందిని వెంట వేసుకొని అరాచకం సృష్టించాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం రామగిరిలో జరిగిన ఘటనతో పాటు గతంలో జరిగిన దాడులు, హత్యలపై విచారణ చేసి బాధిత కుటుంబ సభ్యులు కోరిన విధంగా పరిటాల శ్రీరామ్, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజాస్వామ్యవాదులారా ఏకంకండి
ప్రజాస్వామ్య వాదులందరూ ఏకమై ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పిలుపునిచ్చారు. లోటు బడ్జెట్‌లోనూ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రావాల్సి ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అయితే రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించేందుకు అతిపెద్ద కరోనా వైరస్ అయిన చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. కదిరి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది ప్రజలు పాల్గొన్నా.. ఎవరికీ ఎలాంటి జబ్బు రాలేదన్నారు. అలాంటిది ఎన్నికలు నిర్వహించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎన్నికల కమిషనర్ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రూరల్ మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, రాప్తాడు మార్కెట్‌యార్డు చైర్మన్ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
రామగిరి: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌పై ఐపీసీ 153ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు రామగిరి ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 15వ తేదీ (ఆదివారం) రామగిరి టీడీపీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తలనుద్దేశించి పరిటాల శ్రీరావ్‌ు చేసిన ప్రసం మతం, వర్గం, పార్టీలను ప్రభావితం చేస్తుండటంతో కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రజలను, ఇతర పార్టీల వర్గీయులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలాఉండగా పరిటాల శ్రీరామ్ గతంలో రామగిరిలోని వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చేశామని, తాము అధికారంలోకి వస్తే 15 నిమిషాల్లోనే ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని కూల్చేస్తామని బాహాటంగా చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment