
తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు ఇంఛార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. నీటి సరఫరా పేరుతో టీడీపీ పాలనలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ప్రకాశ్ రెడ్డి.. ప్రజాధనం దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని, లేనిపక్షంలో మంత్రి సునీత బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. అనంతపురంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాముకు పైసా ఖర్చు లేకుండా నీళ్లు అందించ వచ్చన్నారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ మీదుగా నీరు సరఫరా చేస్తే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పేరూరు నీటి సరఫరా పనుల కోసం 1,140 కోట్ల రూపాయల కేటాయింపు వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. మంత్రి పరిటాల సునీత ధనపిశాచిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రకాశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా ధనం దుర్వినియోగం, మంత్రి పరిటాల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని లోకాయుక్తను కోరారు. విచారణ జరపని పక్షంలో ఆమె అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగంపై బహిరంగ చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంత్రి సునీత అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన రైతులకు వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment