సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ పేరుతో తమను మోసం చేశారంటూ తోపుదుర్తిలో డ్వాక్రా మహిళలు మంత్రి పరిటాల సునీతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు కర్కషంగా అరెస్టు చేశారు. డ్వాక్రా మహిళలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. డ్వాక్రా రుణమాఫీ గురించి అడిగితే అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వందలాదిమంది పోలీసులతో మహిళలను ఈడ్చిపారేస్తున్నారని వారు మండిపడ్డారు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ఎవరినీ మోసం చేస్తారని మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు.
మంత్రి పరిటాల సునీత పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. డ్వాక్రా మహిళల అరెస్టులను వైఎస్సార్‌సీపీ ఖండించింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తే అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్వాక్రా మహిళల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని, డ్వాక్రా మహిళలపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టి అర్థమవుతోందని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. డ్వాక్రా మహిళలను పోలీసులు అడ్డుకోవడం దారుణమని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. డ్వాక్రా మహిళలతో మాట్లాడటానికి కూడా మంత్రి పరిటాల సిద్ధంగా లేరని, రుణమాఫీపై మంత్రి సమాధానం చెప్పాలంటూ మహిళలు తిరగబడ్డారని ఆయన తెలిపారు. మరోసారి మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment