
ద్రాక్షారామ (రామచంద్రపురం): ‘మీ ఆత్మలుగా వ్యవహరించిన సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలోకి ఎందుకు వెళ్లారనే విషయమై టీడీపీ శ్రేణులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది చంద్రబాబు గారూ. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఆ ఇద్దరితోపాటు గరికపాటి రామ్మోహనరావు, టీజీ వెంకటేష్ టీడీపీ ఓటమి పాలైన 15 రోజుల్లోనే బీజేపీలో చేరారు. ఆ నలుగురూ మీ కంట్రోల్‌లో ఉంటూ మీకు సన్నిహితంగా మెలిగేవారు. మీకు చెప్పకుండానే పార్టీ మారారా. దీనిపై మీరెందుకు నోరు మెదపటం లేదు’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత తోట త్రిమూర్తులు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం తన అనుచరులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తీరుతో మనస్తాపం చెందిన తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాకినాడలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎంతోమంది పార్టీలోకి వస్తారు, పనులు చేయించుకుని వెళ్లిపోతుంటారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై త్రిమూర్తులు తీవ్రంగా మండిపడ్డారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తానెప్పుడు సొంత ప్రయోజనాలు ఆశించలేదని చెప్పారు. చంద్రబాబు వద్ద సొంత ప్రయోజనాల కోసం ఒక్క పని చేయించుకున్నట్లు నిరూపించినా.. అందరి సమక్షంలో ఎక్కడైనా సమాధానం చెబుతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment