సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రకటించని నియోజకవర్గాల్లో పరిస్థితి అంత సులువుగా దారికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మేడ్చల్ స్థానాన్ని ఎంపీ మల్లారెడ్డికి, మల్కాజిగిరి స్థానాన్ని ఎమ్మెల్సీ హన్మంతరావుకు ఖరారు చేస్తూ.. తాజా మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కనకారెడ్డిలకు ఎమ్మెల్సీ ఇస్తామంటూ పంపిన రాయబారం ఫలించేలా లేదు. తొమ్మిదో తేదీ అనంతరం రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈలోగా మేడ్చల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్ తదితర స్థానాల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అయితే మేడ్చల్ స్థానాన్ని ఎంపీ మల్లారెడ్డికి ఖరారు చేసి ఆయనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో మల్లారెడ్డి ప్రచారాన్ని ప్రారంభించినా.. నియోకవర్గంలో అందరిమధ్యా సయోధ్య కుదిరే వరకు ప్రచారం చేయవద్దని సూచించి ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని చర్చలకు ఆహ్వానించినట్లు సమాచారం.
సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని, పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి స్వయంగా సుధీర్‌రెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే, తాను కేసీఆర్‌ను కలిసిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుధీర్‌రెడ్డి అసంతృప్తినిగానే వెనుదిరిగినట్లు తెలిసింది. మరోవైపు మల్కాజిగిరిని మైనంపల్లి హన్మంతరావుకు ఖరారు చేసి ఈ మేరకు ఆయనకు సమాచారం కూడా ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి తీవ్ర అంసతృప్తితో ఉన్నారు. తొలుత తన కోడలు విజయశాంతికి టికెట్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కనకారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని నేతలు హామీ ఇచ్చినా ఆయన శాంతించే పరిస్థితి కనిపించడం లేదు.
ముషీరాబాద్, ఖైరతాబాద్‌లో ఢీ అంటే ఢీ
నగరంలోని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు గురువారం సాయంత్రం లీక్ ఇచ్చాయి. అయితే, ముషిరాబాద్‌లో తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని, వీలుకాకపోతే తానే పోటీ చేస్తానని హోంమంత్రి నాయిని భీష్మించుకు కూర్చున్నారు. పార్టీ మాత్రం ముఠా గోపాల్ వైపే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో నాయిని వైఖరి ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొంది. ఖైరతాబాద్ నియోకజవర్గం నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్ పేరును దాదాపు ఖరారు చేశారన్న వార్తల నేపథ్యంలో బుధవారం పార్టీ నాయకులు పి.విజయారెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ అభ్యర్థిని ఎవరినీ ఖరారు చేయలేదని, మీరు తొందరపడవద్దని వారించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రానికి తనకు టికెట్ ఖరారైందని దానం సన్నిహితులకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నియోజకవర్గంలో టికెట్ తనకే వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్న విజయారెడ్డి.. దానం నాగేందర్‌ను ఎలాగైనా ఢీ కొట్టే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. గోషామహల్ స్థానాన్ని ప్రేమ్‌సింగ్ రాథోడ్‌కు కేటాయించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment