బాబు పాలనలో.. రైతు కంట కన్నీరు | At The Time Of Chandra Babu ... Rs 87,612 Crores of Agricultural Loans Did Not Happen | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో.. రైతు కంట కన్నీరు

Published Sat, Mar 23 2019 7:08 AM | Last Updated on Sat, Mar 23 2019 7:08 AM

At The Time Of Chandra Babu ... Rs 87,612 Crores of Agricultural Loans Did Not Happen - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌:  బాబు హయాంలో... రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరగలేదు. ఫలితంగా ఆ రుణాలు రూ.1,37,502 కోట్లకు చేరాయి. బంగారంపై తీసుకున్న 35 వేల కోట్ల రూపాయల అప్పుల్ని రద్దు చేసే ప్రసక్తే లేదని బాబు భీష్మించారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ డబ్బులు రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీలకూ సరిపోలేదు. లక్షలాది మంది బ్యాంకుల వద్ద డిఫాల్డర్లుగా మారారు.  
- 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను 7 గంటలకు కోత వేశారు. అది కూడా రోజులో ఒకేసారి ఇవ్వకుండా అర్థరాత్రి, అపరాత్రి దఫదఫాలుగా ఇవ్వడంతో రైతులు పడిన ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు.   
- చంద్రబాబు ధరల స్థిరీకరణ నిధి విషయం పూర్తిగా మరిచిపోయారు. అధికారంలో ఐదేళ్లు గడిచినా రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఊసే లేదు.  
- స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అటకెక్కాయి. కనీస మద్దతు ధర కనుమరుగైంది. రైతులు తాము పండించిన ఉత్పత్తులకు ధర రాక తగలబెట్టడం తెలిసిందే. 
- 16.5 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. 5.6 లక్షల మందికి మాత్రమే కార్డులు దక్కగా.. ఇందులో 4 లక్షలకు పైగా రెన్యువల్‌ చేసినవే. 
- ప్రస్తుతం అమల్లో ఉన్నది ప్రధాన మంత్రి పంటల బీమానే. చంద్రబాబు కొత్తగా ఏమీ చేయలేదు.  
- ఐదేళ్లు గడిచినా .. ఎలాంటి విత్తన చట్టం బయటకు రాలేదు 
- మాటలే తప్ప ఇప్పటి వరకూ వ్యవసాయ పర్యాటకంపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. 
- ఇలాంటి హామీలెన్నో ఇచ్చారే తప్ప ఐదేళ్ల పాలనలో అసలు ఇలాంటి ఆలోచనే ఎప్పుడూ చేయలేదు.

వైఎస్‌ హయాంలో  రైతే రాజు
2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే మహానేత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం– ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేశారు. ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై కరెంటు ఉండదు.. బట్టలారేసుకోవడానికే పనికొస్తాయని అవహేళన చేసిన చంద్రబాబుకు దిమ్మతిరిగేలా రైతులందరికీ ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఆదుకొని వైఎస్సార్‌ చరిత్రలో నిలిచిపోయారు.

మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కరువుబారిన పడిన జిల్లాల్లో రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయించారు. అంతేకాదు సకాలంలో రుణాలు చెల్లించిన వారిని నిరుత్సాహపరచకూడదనే భావనతో రుణాలు చెల్లించిన రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. వైఎస్‌ సీఎం కాగానే రైతుల విద్యుత్‌ బకాయిలన్నింటినీ రద్దు చేశారు. పావలా వడ్డీకే పంట రుణాలు ఇప్పించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించారు.

రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని ఇంటికి వచ్చేలా చేశారు. దిగుబడిని పెంచేలా మౌలిక వసతులు కల్పించారు. భూగర్భ జలాల పెంపునకు ఇతోధికంగా తోడ్పడ్డారు. జలయజ్ఞాన్ని ప్రారంభించి లక్షలాది ఎకరాలకు నీరు అందించేలా చేశారు.  ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు రైతులను వేధించకుండా చట్టం తీసుకొచ్చి.. అప్పులపై మారటోరియం ప్రకటింప చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు రాజుగానే బతికారు.  

పైసా కూడా మాఫీ కాలేదు  
నాకు 5.15 ఎకరాల పొలం ఉండగా.. రాప్తాడు కెనరా బ్యాంకులో పంట రుణం కింద రూ.60 వేలు, బంగారు నగలు కుదవపెట్టి మరో రూ.లక్ష అప్పు తీసుకున్నా. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అప్పంతా తీరిపోతుందని ఆనందపడ్డా. రుణమాఫీ జాబితాలో నా పేరే లేకుండా పోయింది. ఇదేంటని అధికారులను, బ్యాంకుల్లో అడిగినా సరిగా చెప్పడం లేదు. మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో రాప్తాడు కేంద్రంలో నిర్వహించిన రుణమాఫీ పరిష్కార వేదికకు వెళ్లి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. చివరకు బయట వ్యక్తుల దగ్గర రూ.60 వేలకు రూ.8 వేల వడ్డీకి అప్పుతెచ్చి పంట రుణం రెన్యువల్‌ చేసుకున్నా. అసలుకు రూ.12 వేలు వడ్డీ కట్టి బంగారు నగలు విడిపించుకున్నా. ఇక అన్నదాత సుఖీభవ కింద రూ.1,000 కూడా పడలేదు. మళ్లీ అధికారులను కలిసి పత్రాలు ఇచ్చినా ఇంకా రాలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మే నెలలోనే పంట ఖర్చులకు రూ.12,500 ఇస్తామనడం మంచిదే.   
– చుక్క ఆంజనేయులు, హంపాపురం (రాప్తాడు)

విద్యుత్‌  సరఫరా లేక ఎండిన పంటలు  
నాపేరు భూక్యా గోవిందునాయక్‌. మాది బొల్లాపల్లి మండలం లక్ష్మీపురం తండా. గత కొంతకాలం నుంచి రెండున్నర ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పొగాకు, మిరప పంటలను సాగు చేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 9గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రకటించి.. సక్రమంగా ఇవ్వలేదు. సరఫరాలో సమయపాలన లేకపోవడం, త్రీఫేస్‌ విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో తెలియక సక్రమంగా నీరు రాక పంట పొలాలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ సరిగా అమలు కావడం లేదనడానికి నేనే ఒక ఉదాహరణ.

ఆత్మహత్య చేసుకున్న రైతు బాబూరావు కుటుంబాన్ని పట్టించుకోని ప్రభుత్వం 
సి.బెళగల్‌: కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలంలోని మారందొడ్డి గ్రామానికి చెందిన హరిజన బాబూరావు (38) తనకున్న రెండు ఎకరాల పొలంలో  పంటలు సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈయన కూతురు గీత, ఇంటర్‌ చదివిన కుమారుడు తేజ సంతానం.  బాబూరావు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి పొలంలో రూ.90 వేలతో బోరు వేయించారు. అదేవిధంగా నీటి నిల్వకోసం పొలంలో రూ.70 వేలు వెచ్చించి ఉపరితల ట్యాంక్‌ (సర్ఫేస్‌ ట్యాంక్‌) నిర్మించుకున్నాడు.

ఉల్లి పంట సాగుకు పెట్టుబడిగా గూడూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో రూ.2 లక్షల పంటరుణం తీసుకున్నాడు. తాను పండించిన పంట అమ్ముకునేందుకు వెళ్లిన బాబూరావు ఉల్లి పంటకు గిట్టుబాటు ధరలేక, కర్నూలు ఉల్లి మార్కెట్‌ యార్డులో గత ఏడాది సెప్టెంబర్‌ 1న పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఆయన మృతి చెందటంతో కుటుంబం గడవని పరిస్థితిలో.. మృతుడి భార్య, కుమారుడు కూలి పనులతో జీవనంసాగిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

అప్పులు ఎట్లకట్టాలో: మేరిబా, మృతుడి భార్య 
పంటలు పండించేందుకు, బోరు వేసినందుకు, ట్యాంక్‌ కట్టించుకున్నందుకు మా ఆయన బ్యాంక్‌లో, తెలిసిన వారి దగ్గర రూ.5 లక్షల అప్పులు చేశారు. పండించిన పంటలకు ధరలులేక పురుగుల మందుతాగి చనిపోయాడు. ఆయన చేసిన అప్పులు అట్లే ఉన్నాయి. మా దగ్గర చిల్లిగవ్వలేదు. మేము బతికేందుకే ఇబ్బందులు పడుతున్నాము. మేము ఎలా అప్పులు కట్టాలి. 

ప్రభుత్వం పట్టించుకోవటం లేదు: తేజ, కుమారుడు
మా నాన్న అప్పులు చేసి చనిపోతే ప్రభుత్వ అధికారులు పరిహారం ఇప్పిస్తాం, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తామంటూ నమ్మ బలికారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆఫీస్‌ల చుట్టూ, సారోళ్ల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. 

1500 అడుగుల బోరు వేసినా చుక్కనీరు కరువే 
నా పేరు ఎం.వెంకటశివ. మాది లింగాల మండలం అంబకపల్లె గ్రామం. మాకున్న 7ఎకరాల పొలంలో రెండు బోర్లు ఉండగా.. అరకొరగా నీరు వస్తున్నాయి. ఇటీవలే వరుసపెట్టి బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. సుమారు 6బోర్లు వేశా. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి సుమారు 1200అడుగుల నుంచి 1500 అడుగుల వరకు డ్రిల్‌ చేయించా. కానీ నీటి చెమ్మ కనిపించలేదు. బూడిద మాత్రం బయటకు వస్తోంది. అరటి పంటను కాపాడుకోవాలంటే.. కచ్చితంగా బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి. నీరేమో పాతాళం నుంచి బయటకు రావడంలేదు. ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి. 

నా భర్త ఆత్మహత్యకు బాబు ప్రభుత్వ విధానాలే కారణం
కౌలు రైతు అయిన నా భర్త అల్లాడ ఆనంద్‌ 2015 జూన్‌ 29న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసి ఇచ్చిన 25 సెంట్ల జిరాయితీతో పాటు, రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. నీలం తుపాను తాకిడికి పంట సర్వం నాశనమైంది. ప్రభుత్వం పరిహారం ఇవ్వనే లేదు. పెట్టుబడి కుటుంబ పోషణ కోసం అప్పు తెచ్చిన రూ.3 లక్షలు తీర్చే మార్గం లేకుండాపోయింది. దీంతో నా భర్త తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బీఎస్సీ చదువుతున్న నా కుమారుడు చదువు మానేసి ఆటో నడుపుతున్నాడు. నాకు నలుగురు కుమార్తెలు. నేను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇంటి బిల్లులు రాకపోవడంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. జన్మ భూమి కమిటీల కారణంగా నాకు వితంతు పింఛన్‌ కూడా రావడం లేదు. పేదరికంతో వీధినపడ్డ మాలాంటి దళిత కుటుంబంపై ప్రభుత్వానికి కనికరం లేదు.  
– సరోజినమ్మ, భామిని, శ్రీకాకుళం జిల్లా 

రుణమాఫీతో మోసపోయాం 
మాకు ఐదెకరాల పొలం ఉంది. 2013లో రాప్తాడు కెనరాబ్యాంకులో పంట రుణం కింద రూ.60 వేలు తీసుకున్నాం. పంట ఖర్చుల కోసం బంగారు నగలు తాకట్టు పెట్టి అదే బ్యాంకులోనే రూ.80 వేలు తీసుకున్నాం. పట్టాదారు పాస్‌ పుస్తకం కింద మొత్తంగా రూ.1.40 లక్షలు ఉంది. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు రుణమాఫీ హామీ ఇవ్వడంతో రూ.1.40 లక్షలు పోతాదని సంబరపడ్డాం. తీరా సంవత్సరం తర్వాత చూస్తే రూ.25 వేలు మాఫీ అయినట్లు పత్రం చేతికిచ్చారు.

అధికారులు అడిగిన పత్రాలు ఇచ్చి ఫిర్యాదు చేశా. అయినా లాభం లేదు. దాంతో చేసేదేమీ లేక 2015లో పంట రుణం రూ.60 వేలకు రూ.25 వేలు మాఫీ పోనూ..వడ్డీతో కలిపి రూ.42 వేలు కట్టి రెన్యువల్‌ చేయించుకున్నాం. అంటే రూ.7 వేలు వడ్డీపడింది. ఇక బంగారు నగలు తాకట్టు రుణం రూ.80వేలు ఉండగా.. దానికి రూ.1.20 లక్షలు కట్టి విడిపించుకున్నాం. అంటే రెండేళ్లకు రూ.40 వేల వరకు వడ్డీ కట్టాం.  

మొత్తంగా చూస్తే రూ.1.40 లక్షల రుణం ఉండగా.. అందులో రూ.25 వేలు మాఫీ పోయినా.. మేము కట్టింది రూ.1.62 లక్షలు. ఇదెక్కడి రుణమాఫీనో అర్థంకాలేదు. ఇక మధ్యలో రూ.3 వేల వరకు పావలావడ్డీ పడింది. వరుసగా పంటలు దెబ్బతింటున్నా మాకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వలేదు. ఇటీవల అన్నదాత సుఖీభవ కింద రూ.1,000 పడింది. ఈ లెక్క కనీసం వారం రోజులు కాఫీ, టీలకు కూడా చాలదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏటా మే నెలలోనే రూ.12,500 ఇస్తే రైతులకు కొంత బాగుంటుంది. 
మోడిపల్లి అక్కమ్మ, ఎం. వెంకటనాయుడు దంపతులు  

పంటనష్ట పరిహారం ఇవ్వకుండా ముంచేశారు 
నా పేరు ముళ్లపూడి రాము. మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం, జగన్నాధపురం గ్రామం. ఎర్రకాలవ బాడవలో నా కుమార్తె, నాకు కలిపి ఏడున్నర ఎకరాల పొలం ఉంది. గతేడాది ఆగస్టు 20వ తేదీన వచ్చిన ఎర్రకాల్వ వరదలో నా పొలం మొత్తం మునిగిపోయింది. ఏడున్నర ఎకరాలకు లక్షా 50 వేల రూపాయల పెట్టుబడి పెట్టాను. అధికారులు వచ్చి లెక్కలు వేశారు. ఎకరాకు ఆరు వేల వంతున పంటనష్ట పరిహారం అందచేస్తామన్నారు. ఇటీవల రాజమండ్రికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ పరిహారాన్ని హెక్టారుకు రూ.25వేలు ఇస్తామన్నారు.

నెలలు గడుస్తున్నా ఇంతవరకు మాకు ప్రభుత్వం ఇవ్వలేదు. వ్యవసాయాధికారులను అడిగితే లెక్కలు ప్రభుత్వానికి పంపించాం. ట్రెజరీలో సొమ్ములు లేవు. ఇవిగో వస్తాయి. అవిగో వస్తాయంటున్నారు. కాని ఈ రోజు వరకు పైసా రాలేదు.  ఒక్క తాడేపల్లిగూడెం మండలంలో సుమారు ఆరువేల ఎకరాల పొలం ఎర్రకాల్వ వరద వల్ల మునిగిపోయింది. అంతా చిన్నసన్న కారు రైతులు. మూడు వేల మందికి పైగా ఉన్నారు. పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతు నోట్లో మట్టి కొట్టింది. రైతులను ఆదుకోవాలి. 
 – ముళ్లపూడి రాము , రైతు జగన్నాధపురం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement