సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా దేశ రాజధానిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదుకోట్లమంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబో తున్నారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన ఆ పార్టీ ఇపుడు అంతిమ పోరాటానికి సన్నద్ధమయ్యింది.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం శుక్రవారం కూడా చర్చకు రాకుండా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడినట్లయితే ఆ మరుక్షణమే వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు తమ పదవులను తృణప్రాయంగా త్యజించనున్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేసి ఆ లేఖలను కేంద్రం మొఖాన కొట్టి బయటకు రానున్నారు. రాజీనామాలను ఆమోదించాలని కోరనున్నారు. ఆ వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అయిన ఏపీభవన్‌లో వారు ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు.
పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తమ నాలుగేళ్ల ప్రత్యేక హోదా పోరాటాన్ని పతాక స్థాయికి చేర్చిన ఎంపీలు తాజా బడ్జెట్ సమావేశాల్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చగలిగారు. చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో కేంద్రంపై 13సార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. అవిశ్వాస తీర్మానానికి అందరూ కలసి వచ్చే పరిస్థితి కల్పించారు.
అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాం తప్ప ప్రత్యేకహోదా పోరాటాన్ని వదిలేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. ప్రత్యేక హోదా ముందు పదవులు తమకో లెక్క కాదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజల ఆకాంక్షలను బలంగా చాటిచెబుతామని, ప్రజాన్యాయస్థానంలోనే తేల్చుకుంటామని ప్రతిన పూనారు. కాగా పదవులను త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్న ఎంపీలకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ తరలివచ్చారు.
పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, డాక్టర్ అరుణ్‌కుమార్ తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఢిల్లీ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment