సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా, ఇప్పటివరకు 1076 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు నుంచి అభ్యర్థుల స్క్రూటినీ మొదలు పెడతామని తెలిపాయి. ప్రతి నియోజక వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వనున్నట్టు ముఖ్య నేతలు చెప్పారు. అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, ప్రజాబలం పరిగణలోకి తీసుకుని.. సర్వేల ఫలితాల ఆధారంగా గెలుపు గుర్రాల జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేయనుంది. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా టీడీపీ, వామపక్ష పార్టీలతో దోసీ కట్టిన కాంగ్రెస్.. ఎన్నికల పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు అనంతరమే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనుంది.
ప్రజాభిప్రాయాలతోనే మేనిఫెస్టో
గాంధీభవన్‌లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ప్రజల అభిప్రాయాలే ప్రాతిపదికగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. మేనిఫెస్టో కమిటీకి అనుబంధంగా మరో 5 కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ 5 కమిటీలు రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి.. ఆయా సమావేశాల్లో వివిధ సంఘాల నుంచి వినతులను స్వీకరిస్తాయని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టే ప్రతి అంశంపై వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచతామని వెల్లడించారు. ఆర్థికపరంగా ఆమోదయోగ్యమైనవి, న్యాయపరంగా చిక్కులు లేనివి, ప్రజా బాహుళ్యం మెచ్చిన అంశాలు మేనిఫెస్టోలో చేర్చుతామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment