బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయికి నివాళులర్పిస్తున్న దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రభాకర్, బద్దం బాల్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణంతో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త తెలియగానే పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించి, ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతి పార్టీకే కాకుండా దేశ ప్రజలకు తీరని లోటని పేర్కొంది. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నేతలు చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు సమావేశంలో వాజ్‌పేయి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం పట్ల సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి తదితరులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వాజ్‌పేయి మరణం దేశ ప్రజలకు తీరని లోటని బీజేపీ జాతీయ నాయకుడు, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.
పార్టీ కార్యక్రమాలన్నీ వాయిదా: లక్ష్మణ్
వాజ్‌పేయి అజాతశత్రువని, అన్ని వర్గాల ప్రజల మన్ననలను చూరగొన్న గొప్ప నాయకుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు పాటించిన మహా నాయకుడని అన్నారు. వాజ్‌పేయికి హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉందన్నారు. బార్కాస్, ఖైరతాబాద్, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారన్నారు. వాజ్‌పేయి ఇక లేరన్న వార్త తమను ఎంతగానో కలచివేసిందన్నారు. ప్రధానిగా ఆయన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ఎంతో ముందుండేవారన్నారు. టెలికాం విప్లవం, స్వర్ణ ఛతుర్భుజి వంటి అనేక పథకాలతో చరిత్ర సృష్టించారన్నారు. వాజ్‌పేయి మరణం నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలను వారం పాటు వాయిదా వేస్తున్నామన్నారు. పార్టీ జిల్లా, మండల, గ్రామ కార్యాలయాల్లో సంతాప కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
ఆయన వెన్నంటే ఉన్నా: కిషన్‌రెడ్డి
వాజ్‌పేయి హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చినా పార్టీ కార్యాలయంలో ఉన్న తానే ఆయనకు సంబంధిం చిన అన్ని విషయాలను చూశానని బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మరణం తమను కలచివేస్తోందన్నారు. తాను బీజేవైఎం జాతీయ అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనపై ఉన్న నమ్మకంతో ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సదస్సు నిర్వహణకు అంగీకరించారన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలతో మన శాస్త్రవేత్తల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటడంతోపాటు, అణుసంపత్తి కలిగిన దేశంగా ప్రపంచ దేశాలకు తెలియజెప్పారన్నారు. కార్గిల్ యుద్ధంలో సైనికులకు మనోబలాన్ని ఇచ్చి విజయం చేకూర్చారన్నారు. రూ.80 వేల కోట్ల స్వర్ణ ఛతుర్భుజి, ఎయిర్‌పోర్టు, కనెక్టివిటీని పెంచారన్నారు.
జీర్ణించుకోలేకపోతున్నా: దత్తాత్రేయ
వాజ్‌పేయి లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని, ఆ వార్త తనను ఎంతగానో కలచివేసిందని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో సమావేశం అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో దత్తాత్రేయ మాట్లాడారు. వాజ్‌పేయితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసినప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. దేశమే గర్వించదగిన గొప్ప దార్శనికుడు వాజ్‌పేయి అని పేర్కొన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ, పీవీల మన్ననలను చూరగొన్న గొప్పనేత అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment