ఎన్నికల్లో ఓటర్లకు అభ్యర్థులు డబ్బులివ్వడం మామూలే. ఓటర్లకు డబ్బులు పంచడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టి, బయటకు పొక్కితే అభ్యర్థికి ఇబ్బందులొస్తాయి కాబట్టి మూడో కంటికి తెలియకుండా సొమ్ములిస్తుంటారు. అయితే, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ పార్టీకి చెందిన నాయకుడొకరు ఏకంగా ఓటర్లకు (రైతులకు) చెక్కులు పంపిణీ చేశారు. దాదాపు వంద మందికి రూ.2 వేలు, రూ.5 వేల చెక్కులు ఇచ్చారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ పంచాయతీ ప్రధాన్ (సర్పంచ్) మదసుర్ హుస్సేన్ ఇలా చెక్కులు పంచుతూ దొరికిపోయారు. అయినా ఆయనేం భయపడలేదు. చెక్కులిస్తే తప్పేమిటని ఎదురు నిలదీశారు. ‘అవును మేం చెక్కులు ఇచ్చాం.
అయితే ఏంటి.. చెక్కులిచ్చాం కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీకి ఓటేయమని అడుగుతాం. చెక్కు తీసుకున్నారు కాబట్టి వారు తప్పకుండా మాకే ఓటేసి తీరుతారు. ఇందులో తప్పేముంది?’ అని ప్రశ్నించారాయన. అంతేకాకుండా ఆ చెక్కులు దీదీ (మమతా బెనర్జీ) ఇచ్చారని కూడా చెబుతున్నారు. మొత్తం 600 మంది రైతులకు చెక్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు. చెక్కులిచ్చి ఓట్లు అడగడంతో ఊరుకోకుండా.. ‘ఈ చెక్కులు దీదీ ఇచ్చిందన్న సంగతి గుర్తుంచుకోండి. చెక్కుకు బదులుగా మీరు మీ ఓటు మాకివ్వాలి. ఒకవేళ చెక్కు తీసుకుని ఓటేయకపోతే మీపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెబుతున్నా.. మీ ఓటరు కార్డు నకళ్లు మా దగ్గరున్నాయన్న సంగతి మరిచిపోవద్దు’ అంటూ బహిరంగంగానే బెదిరిస్తున్నారు. తమ పార్టీకి ఓటెయ్యకపోతే ప్రభుత్వ పథకాల కింద రైతుకు రావలసిన రూ.2 లక్షలు రాకుండా చేస్తామని కూడా హుస్సేన్ హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment