నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన కార్యకర్తలు, అభిమానులు. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న కేసీఆర్
సాక్షి నెట్‌వర్క్: ‘‘చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాలో కొంత మందిని పోటీకి పెట్టినాడు. జిల్లా ప్రజలను, మేధావులను ఒక్క మాట సూటిగా కోరుతున్నా! చంద్రబాబు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి. మిమ్మల్ని వదల బొమ్మాళీ వదలా అని పట్టి పీడిస్తున్నడు. దాన్ని ఎట్ల తరిమి కొట్టాలనో మీరే నిర్ణయం చేయాలి. నేనైతే ఒకసారి తరిమి కొడితే పారిపోయిండు. ఇప్పుడు తరిమికొట్టే బాధ్యత ప్రజల మీద ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ పరులపాలు కాకుండా చూసుకోవాలి’’అని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పాలమూరును తొమ్మిదేళ్లు దత్తత తీసుకుని వలసల జిల్లాగా మార్చిన చంద్రబాబు.. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే వద్దని ఢిల్లీకి లేఖలు రాశారని.. అలాంటి వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ‘‘మన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న వ్యక్తికి ఓట్లేయడానికి మనమేమైన ఎడ్డోళ్లమా? అంత అమాయకులమా? మహాకూటమి పేరు మీద చంద్రబాబు మళ్లీ తెలంగాణలో దూరిపోయి మీ ఇంట్లోకి వచ్చి కొట్టి పోతా అంటున్నడు. చంద్రబాబుకు ఓటేసి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపుకుందామా? లేక డిపాజిట్ రాకుండా ఓడగొట్టి బుద్ధి చెబుదామా? అనేది పాలమూరు ప్రజలు నిర్ణయం చేయాలి’’అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నల్లగొండ జిల్లా దేవరకొండ, నకిరేకల్, యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి, మెదక్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. ఆయా సభల్లో ఆయనేమన్నారంటే...
జడ్చర్ల సభలో...
రాష్ట్రం సాధించుకున్న తర్వాత నాలుగేళ్లలో ఏం జరిగిందో మీ కళ్ల ముందే ఉంది. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తి చేసుకున్నం. కేవలం పది శాతం పనులు మాత్రమే మిగిలినయి. పాత పాలమూరు జిల్లాలో ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు పారించుకోగలుగుతున్నాం. వలసలు మాయమైపోయి.. బొంబై బస్సులు బంద్ అయితున్నయి. కచ్చితంగా పాలమూరు కరువు తీరాలే. మనం కంటున్న కల.. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ కావాలి. ఆ కోటి ఎకరాల్లో పాలమూరు జిల్లాలో పాత, కొత్త అంతా కలిపి 20 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. ఇప్పటికీ చెబుతున్నా.. ఆంధ్ర పాలకులు, చంద్రబాబు పాలమూరులో వేసిన పునాది రాళ్లు తీసుకుపోయి కృష్ణా నదిలో అడ్డం వేస్తే అదే పెద్ద డ్యాం అయితది.. దాంతో మనకు నీళ్లు వస్తయి. రైతుబంధు కింద ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఎకరానికి రూ.10వేల ఇయ్యబోతున్నాం. గత ప్రభుత్వాలు నీటి తీరువాలు, భూమి కిస్తులు వసూలు చేసినాయి. మేం వాటిని రద్దు చేయడంతో పాటు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. అన్ని గ్రామాల్లోని ఇళ్లకు త్వరలోనే నీళ్లు కూడా రాబోతున్నాయి.
మెదక్ సభలో...
బక్క పేద కేసీఆర్‌ను కొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదు. అందుకే చంద్రబాబును తన భుజాలపై మోసుకుని వస్తోంది. అధికారం కోసం కాంగ్రెస్ ఎంత నీచానికైనా దిగజారుతుంది. మళ్లీ తెలంగాణకు చంద్రబాబు పెత్తనం అవసరంలేదు. ఓటుతో దెబ్బ కొట్టి కాంగ్రెస్, టీడీపీ రోగం కుదర్చాలి. స్వతంత్రంగా ఉన్న తెలంగాణను మళ్లీ వలసవాద పెత్తనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్, టీడీపీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మనమంతా దరఖాస్తులు పట్టుకుని విజయవాడ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తెలంగాణ ప్రజానీకానికి అవసరమా? మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి త్వరలోనే జూన్ లోగా మెదక్ జిల్లాకు గోదావరి జలాలు అందజేస్తాం.
దేవరకొండ,నకిరేకల్ సభల్లో...
ప్రధాని మోదీకి హిందూ ముస్లిం తేడా అనే బీమారీ ఉంది. ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటా. అంటే నేను ఢిల్లీకి వెళ్తానని కాదు. తెలంగాణలోనే ఉండి కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తా. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాష్ట్రంలో పెరిగిన గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి మోదీకి ఏమైంది? ఆయన ఆలోచనలకు చెదలు పట్టాయా? రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా మార్చి హక్కులను హరించి ప్రజలకు న్యాయం జరగకుండా కర్ర పెత్తనం చలాయిస్తున్నారు. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ముస్లింలకు జరగాల్సిన న్యాయం జరగడంలేదు. రాష్ట్రాల హక్కులను సాధించాలంటే కేంద్రంలో చురుగ్గా ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే.. వాళ్లది కాషాయం.. వీళ్లది మూడు రంగుల జెండా. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించి కర్ర పెత్తనం చేస్తోంది. ఈ స్థితి మారాలంటే కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలి. కేంద్రంలో కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రభుత్వం రావాలి. ఈ ఎన్నికలయ్యాక ఇందుకోసం కృషిచేస్తాను.
వారికి చేతకాక బాబును తెస్తున్నారు...
తెలంగాణను అమరావతికి తొత్తుగా మార్చాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. చంద్రబాబును భుజాల మీద ఎక్కించుకుని తీసుకొస్తున్నారు. ఆయన్ను తీసుకురావడంలో ఈ జిల్లాకు చెందిన మాజీ ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. నన్ను ఎదుర్కోలేక ఈ ఇద్దరు దద్దమ్మలు ఆంధ్రా పెత్తనం కిందకి తెలంగాణను తీసుకుపోవాలనుకుంటున్నారు. ఎన్నో సమస్యలు అధిగమించి వచ్చిన తెలంగాణను మళ్లీ అమరావతికి తొత్తుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణను వారి ప్రమాదం నుంచి కాపాడాలంటే యావత్ తెలంగాణ ప్రజలు కొట్లాడి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి.
భువనగిరి సభలో...
సమైక్య పాలనలో మూసీని మురికి కంపుగా మార్చారు. రూ.800 కోట్లతో ప్రత్యేక సంస్థ ద్వారా రెండేళ్లలో మూసీ నీటిని శుద్ధి చేసి స్వచ్చమైన నీటిని అందిస్తాం. ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నాం. జిల్లా కేంద్రంలోని చరిత్రాత్మక ఖిలాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. మరో రెండేళ్లలో బస్వాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. టీఆర్‌ఎస్ పాలన మీ కళ్ల ముందుంది. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి.
పదికి పది స్థానాలు గెలుస్తాం: హరీశ్
‘‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందటం ఖాయం. మహాకూటమిలో కోదండరామ్‌కు టికెట్లు దక్కని స్థితి నెలకొంది. ప్రజలు కూటమిని ఓడించి తగిన బుద్ధి చెప్పాలి’’ అని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment