వారు పోలింగ్‌కు వస్తే మనదే విజయం: కేసీఆర్‌ | TRS chief KCR nominated mla candidates | Sakshi
Sakshi News home page

మనకు అండాదండా వారే

Published Thu, Oct 25 2018 5:11 AM | Last Updated on Thu, Oct 25 2018 10:21 AM

TRS chief KCR nominated mla candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేసిన పనులే గెలిపిస్తాయని టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులే అండగా ఉండి గెలిపిస్తారని భావిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిని పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చేలా అభ్యర్థులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులకు సూచించారు. బుధవారం పలువురు అభ్యర్థులతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. ప్రచారం ఎలా సాగుతోందని, ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల్లో సానుకూల స్పందన ఉందని పలువురు అభ్యర్థులు వివరిం చారు. ఇటీవల అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో చెప్పినట్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల వ్యూహం ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారు. ‘రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ల పెంపు, సబ్సిడీ ట్రాక్టర్లు, సాగు యంత్రాలు, కేసీఆర్‌ కిట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల వంటి పథకాలతో లబ్ధిపొందిన వారు కోటి మందికిపైగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 30 వేల నుంచి 60 వేల మంది వరకు ఉన్నారు. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తారు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి’అని సీఎం కేసీఆర్‌ అభ్యర్థులకు చెప్పారు.

లక్షల్లో లబ్ధిదారులు: రాష్ట్రంలోని ఒక్కో కుటుంబం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన నాలుగైదు పథకాల నుంచి లబ్ధిపొందినట్లు నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణలో అన్ని రకాల పింఛనుదారులు సుమారు 45 లక్షల మంది ఉన్నారు. రైతుబంధు పథకంతోనే సుమారు 51 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందింది. పంట రుణాల మాఫీ పథకం లబ్ధిదారులు 35 లక్షల మంది ఉన్నారు. మూడు లక్షల మంది గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలు అందించారు. ఉచితంగా చేపల పంపిణీతో లబ్ధిపొందిన ముదిరాజ్, గంగపుత్రులు లక్షల మంది ఉన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులు లక్షల్లోనే ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లోని గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాలను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇటీవల అభ్యర్థులకు పంపిణీ చేసింది. గ్రామాల వారీగా ప్రతి లబ్ధిదారును టీఆర్‌ఎస్‌ యంత్రాంగం కలిసేలా ప్రచార ›ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు కేసీఆర్‌ సూచించారు.

31న వరంగల్‌ సభ..
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తదుపరి ఎన్నికల ప్రచార బహిరంగసభ వరంగల్‌లో జరగనుంది. అక్టోబర్‌ 31న ఈ సభను నిర్వహించాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌ను కోరగా, ఇందుకు ఆయన అంగీకరించినట్లు తెలిసింది. వరంగల్‌ బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అప్పగించారు. వరంగల్‌ సమీపంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలోని తిమ్మాపూర్, భట్టుపల్లి, జక్కులొద్ది ప్రాంతాలను కడియం పరిశీలించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులోనూ స్థలాన్ని పరిశీలించారు. ఎక్కడ సభ నిర్వహించాలనేది కేసీఆర్‌ నిర్ణయించనున్నారు. వరంగల్‌ సభ తర్వాతి రోజున ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగసభ నిర్వహణ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement